- కేసులు పెట్టి, నిందితుల రిమాండ్
- ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న ఘటనలు
కామారెడ్డి, వెలుగు: జిల్లాలో భూ కబ్జాలపై పోలీసులు సీరియస్‌గా నజర్‌పెట్టారు. దీంతో భూకబ్జాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు బాధితుల నుంచి కంప్లైంట్స్ అందగానే ఎంక్వైరీకి ఆదేశిస్తున్నారు. కబ్జాలు వాస్తవమని తేలితే తక్షణమే కేసులు నమోదు చేయాలని కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఫిర్యాదులపై యాక్షన్ తీసుకుంటుండడంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు.
ఉన్నతాధికారులకు లేకుంటే స్థానిక పీఎస్‌లలో ఫిర్యాదు చేస్తున్నారు. గతంలో భూ కబ్జాల విషయమై కంప్లైంట్ చేసినా సివిల్ వివాదాలంటూ పోలీసులు కేసు తీసుకోలేదు. దీంతో గతంలో కంప్లైంట్ చేసిన వారు సైతం మళ్లీ పీఎస్‌లలో కంప్లైంట్స్ ఇచ్చేందుకు వస్తున్నారు. నెల రోజుల వ్యవధిలోనే కామారెడ్డి సబ్ డివిజన్ పరిధిలో నాలుగు భూ కబ్జా కేసులు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లా కేంద్రం రోజురోజుకు విస్తరిస్తోంది. దీంతో భూముల ధరలు భారీగా పెరుగుతున్నాయి. టౌన్లో ఎక్కడైనా ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జాదారులు నజర్ వేస్తున్నారు.
స్థానిక లీడర్ల అండ ఉండడంతో బాధితులు కూడా వెనక్కి తగ్గాల్సి వస్తోంది. కొన్ని ఘటనల్లో బాధితులు కబ్జాదారులతో సెటిల్మెంట్ చేసుకున్న సందర్భాలూ ఉన్నాయి. మార్కెట్ లో మంచి ధర ఉన్నా, తక్కువ రేటుకే తమ భూములను అప్పగించారు. భూ కబ్జాలపై పోలీసులకు కంప్లైంట్ చేయగా సివిల్ పంచాయతీలంటూ చర్యలు తీసుకొలేదు. స్థానికంగా ఉన్న ఆఫీసర్లు సైతం పట్టించుకోకపోవడంతో పలువురు బాధితులు ఇటీవల జిల్లా ఎస్పీకి కంప్లైంట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ లో ప్రజాదర్బార్ ను నిర్వహిస్తుండగా అక్కడికి సైతం వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు. విషయం జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయికి చేరుతుండడంతో పోలీసులు యాక్షన్‌లోకి దిగారు. కబ్జాలు వాస్తవమని తేలితే కేసులు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపుతున్నారు.
అరెస్ట్ చేసి రిమాండ్‌కు..
కామారెడ్డి టౌన్‌లోని కాకతీయ నగర్ కాలనీలో రిటైర్డ్ తహసీల్ధార్ పోశెట్టి 1989లో 263 గజాల ప్లాట్ కొన్నారు. ఈ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా ఖాళీగా ఉంచారు. కడీలు పాతి బోర్డును ఏర్పాటు చేయగా, టౌన్‌కు చెందిన శంకరప్ప, ఇతడి కొడుకు శివకుమార్, మరో వ్యక్తి సంతోష్‌కుమార్ కడీలను ధ్వంసం చేసి కబ్జాకు ప్రయత్నించారు.ఫేక్ డాక్యుమెంట్లను సైతం సృష్టించారు. బాధితుడు గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. బాధితులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా దేవునిపల్లి పీఎస్‌లో కేసు నమోదైంది. శంకరప్ప, శివకుమార్, సంతోష్‌కుమార్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.
పలువురిపై కేసులు
కామారెడ్డి సమీపంలోని రామేశ్వర్‌పల్లి శివారులో భూమి కబ్జా చేశారని బాధితుడి ఫిర్యాదు చేయగా శ్రీనివాస్ అనే వ్యక్తితో పాటు మరో నలుగురిపై కేసు నమోదుచేశారు. దేవునిపల్లి శివారులోని కాకతీయనగర్ కాలనీలో టౌన్‌కు చెందిన బస్వయ్య 1985లో 703 గజాల ప్లాట్లు కొన్నాడు. గతంలో భూమి అమ్మిన వ్యక్తి కుటుంబ సభ్యులు సరిహద్దులు మార్చి, ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేశారు. కొద్దిరోజుల కింద ఈ ప్లాట్ల నుంచి రోడ్డు వేసి కబ్జాకు ప్రయత్నించారు. దీనిపై బాధితుడు ఫిర్యాదు చేయగా, ఏడుగురిపై కేసు నమోదు చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకోగా, ముగ్గురిని అరెస్ట్ చేయాల్సి ఉంది.