చోరీ నగలను సీజ్‌‌ చేసే అధికారం పోలీసులకు ఉంది: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: చోరీకి గురైన బంగారు నగలను, ఇతర విలువైన వస్తువులను సీజ్‌‌ చేసే అధికారం పోలీసులకు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. మణప్పురం ఫైనాన్స్‌‌ లిమిటెడ్‌‌ దాఖలు చేసిన పలు పిటిషన్‌‌లను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. తాకట్టు పెట్టిన చోరీ బంగారు నగలను విడుదల చేయాలంటూ కింది కోర్టులో దరఖాస్తు చేసుకోవడానికి మణుప్పరం ఫైనాన్స్‌‌ కంపెనీకి ప్రత్యామ్నాయ అవకాశం ఉందని, ప్రస్తుతం పిటిషన్‌‌లపై ఎలాంటి ఊరటనివ్వలేమని తేల్చి చెప్పింది.

చోరీ కేసుల్లోని బంగారు నగలను స్వాధీనం చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ మణప్పురం ఫైనాన్స్‌‌ లిమిటెడ్‌‌ 2021 నుంచి సుమారు 16 పిటిషన్‌‌లు దాఖలు చేసింది. వీటిని జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డి విచారించారు. పిటిషనర్‌‌ తరఫు అడ్వకేట్ వాదిస్తూ..ఆర్‌‌బీఐ నిబంధనల ప్రకారం నగలను తాకట్టు పెట్టుకుని రుణాలు మంజూరు చేస్తున్నామని కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం పోలీసుల నోటీసు ప్రకారం నగలను వారికి అప్పగిస్తే రుణాన్ని వసూలు చేసుకోవడం కష్టమవుతుందన్నారు. ప్రభుత్వ అడ్వకేట్ మహేశ్‌‌ రాజే వాదిస్తూ..పిటిషన్‌‌ విచారణార్హం కాదన్నారు. 

చోరీ సొత్తును స్వాధీనం చేయాలని నోటీసులు ఇచ్చే అధికారం పోలీసులకు ఉందని తెలిపారు. ఇరుపక్షాల వాదనలను విన్న కోర్టు..చోరీ సొత్తును సీజ్‌‌ చేసే అధికారం సీఆర్‌‌పీసీ సెక్షన్‌‌ 102 (బీఎన్‌‌ఎస్‌‌ఎస్‌‌ 106) ప్రకారం పోలీసులకు ఉందని తెలిపింది. ఇలాంటి నోటీసులను సవాలు చేస్తూ మణప్పురం కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌‌లను కర్నాటక హైకోర్టు కొట్టివేసిందని గుర్తుచేసింది. దర్యాప్తులో భాగంగా దొంగ నగలు సీజ్‌‌ చేసే అధికారం పోలీసులకు ఉందని తేల్చి చెప్పింది. అదేవిధంగా మణప్పురం కంపెనీకి కూడా ప్రత్యామ్నాయ అవకాశాలున్నాయని సూచించింది. పోలీసు నోటీసులను సవాలు చేస్తూ మణప్పురం కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌‌లను కొట్టివేసింది.