చేర్యాల, వెలుగు: సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలం జాలపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ఉంటున్న పేదలను పోలీసులు, రెవెన్యూ అధికారులు సోమవారం బలవంతంగా ఖాళీ చేయించారు. కేటాయించక ముందే ఆక్రమించుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇండ్లు ఖాళీ చేసేందుకు మూడు రోజులు గడువు ఇవ్వాలని, ఒక్కసారిగా ఖాళీ చేయమంటే పిల్లా పాపలతో తాము ఎక్కడికి వెళ్లాలని పోలీసులను నిలదీశారు. పోలీసులు వారిని పట్టించుకోకుండా ఇండ్లల్లోని సామాన్లను బయటపడేశారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గ్రామంలోని అనర్హులకు డబుల్బెడ్రూమ్ఇండ్లు కేటాయించారని ఆరోపించారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి క్యాంపు ఆఫీస్‌లో రహస్యంగా పట్టాలు పంపిణీ చేయడమేంటని ప్రశ్నించారు. ఎంపీపీ, సర్పంచ్, బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇండ్లు కేటాయించారని ఆరోపించారు. కాగా జాలపల్లిలో మొత్తం 30 డబుల్బెడ్రూమ్ఇండ్లు నిర్మించాలని ప్రతిపాదించి 16 ఇండ్ల నిర్మాణం పూర్తిచేశారు. 14 ఇండ్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. గ్రామంలో 84 మంది దరఖాస్తు చేసుకోగా, 16 ఇండ్లకు గ్రామ సభను నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇదే సమయంలో కొందరు ఇండ్లు లేని పేదలు ఆ 16 ఇండ్లను ఆక్రమించి నివాసం ఏర్పరచుకున్నారు.
ALSO READ:రూ.2 వేల 381 వేల కోట్ల డ్రగ్స్ ధ్వంసం
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆదివారం 16 మందికి తన క్యాంప్ ఆఫీసులో పట్టాలు పంపిణీ చేశారు. అయితే గ్రామ సభలో ఎంపిక చేసిన వారికి పట్టాలు అందకపోవడంతో వివాదం తలెత్తింది. తమకు న్యాయం జరిగేవరకు ఇండ్ల నుంచి కదలబోమని దరఖాస్తుదారులు ఆందోళనకు దిగడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్తుల సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక జరగాలని మద్దూరు జడ్పీటీసీ గిరి కొండల్‌రెడ్డి డిమాండ్ చేశారు. దొంగచాటుగా పట్టాలు పంపిణీ చేయడం వెనకున్న ఆంతర్యం ప్రజలకు తెలిసిపోయిందన్నారు. కాగా గ్రామసభలో ఎంపిక చేసిన వారికే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సమక్షంలో పట్టాలు ఇప్పించామని సర్పంచ్ చొప్పరి వరలక్ష్మీసాగర్ తెలిపారు.