పాస్టర్ ప్రవీణ్ మృతిఘటన: రాజమండ్రికి ఫోరెన్సిక్ బృందం :ఎస్పీ

పాస్టర్ ప్రవీణ్ మృతిఘటన: రాజమండ్రికి ఫోరెన్సిక్ బృందం :ఎస్పీ

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రవీణ్ మృతిచెందిన ఘటన స్థలానికి ఫోరెన్సిక్ నిపుణుల బృందం వెళ్లి పరిశీలించింది. డీఎస్పీ స్థాయి అధికారి సమక్షంలో దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసులో హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు రెండు బృందాలు, విజయవాడనుంచి రాజమండ్రి వరకు మరో రెండు పోలీసులు బృందాలు పనిచేస్తున్నాయి. సీసీ ఫుటేజీని ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.ఈ కేసులో సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సమీక్ష చేస్తున్నారు. 

అయితే పాస్టర్ ప్రవీణ్ మృతి ఘటనకు సంబంధించి మతపరమైన  విద్వేషాలు, వదంతులు ప్రచారం చేయొద్దని పోలీసులు హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా  సోషల్ మీడియా పోస్టులను గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అటువంటి వారిపై కేసులు నమోదు చేసి కోర్టు ఎదుట హాజరు పరుస్తామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. 

ప్రముఖ క్రైస్తవ మతభోధకుడు ప్రవీణ్‌ పగడాల బుధవారం( మార్చి 24) రాత్రి రాజమండ్రిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. సీసీ ఫుటేజ్‌ ప్రకారం.. హైదరాబాద్‌ నుంచి బుల్లెట్‌పై వస్తున్న పాస్టర్‌ ప్రవీణ్‌ సోమవారం రాత్రి రాజమండ్రి వద్ద రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అయితే ప్రవీణ్ పగడాల మృతి యాక్సిడెంట్ వల్ల కాదని.. అనుమానాస్పదంగా ఉందని బుధవారం రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధనాసుపత్రి వద్ద క్రైస్తవ సంఘాల నాయకులు, అభిమానులు ఆందోళన చేపట్టారు. దీంతో సీఎం చంద్రబాబు డీఎస్పీ స్థాయి ఉన్నతాధికారి సమక్షంలో విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.