
- డ్రగ్స్ కేసులో హైదరాబాద్ లింకు తెంపేసిన లోకల్ పోలీసులు
- గంజాయికే పరిమితం చేసేందుకు యత్నం
- స్వధార్ హోమ్ ఇన్చార్జికి బెదిరింపులు
- కేసును పక్కదారి పట్టించేందుకు కుట్ర
- బాలిక తండ్రితో బలవంతపు వీడియోలు
- నిబంధనలకు విరుద్ధంగా వీడియో వైరల్
కరీంనగర్ , వెలుగు: గంజాయి ఎరగా చూపి బాలికపై అత్యాచారం చేసిన కేసులో పోలీస్ ఇన్వెస్టిగేషన్ జగిత్యాల దాటడం లేదు. జగిత్యాల జిల్లాకు చెందిన బాధిత బాలికతోపాటు మరికొందరు ఆడపిల్లలను ఓ ముఠా తరుచూ హైదరాబాద్‌లో జరిగే రేవ్పార్టీలకు తీసుకెళ్లిందని, ఈ క్రమంలో వాళ్లకు డ్రగ్స్అలవాటు చేసి సెక్స్‌రాకెట్ నడిపారనే వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని బాధిత బాలికతోపాటు ఆమె ఆశ్రయం పొందుతున్న స్వధార్ హోమ్ నిర్వాహకురాలు స్వయంగా మీడియా ప్రతినిధులకు వెల్లడించారు. పత్రికల్లో వచ్చిన వార్తలతో జగిత్యాల జిల్లా పోలీసులపై ఉన్నతాధికారుల ఒత్తిడి పెరిగింది.
దీంతో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌చేసి చేతులు దులుపుకొన్నారు. అనంతరం మీడియాకు ఎలాంటి వివరాలు చెప్పొద్దని స్వధార్ హోం నిర్వాహకురాలిని సీఐ బెదిరించినట్టు తెలిసింది. దీంతో ఇన్వెస్టిగేషన్లో గంజాయి, డ్రగ్స్ రాకెట్ గుట్టుబయటపడుతుందని, తద్వారా మరో బాలికకు ఇలాంటి అన్యాయం జరగకుండా పోలీసులు ఆపుతారని భావించినవారికి నిరాశే మిగిలింది. ఉన్నతాధికారుల ఒత్తిళ్లను తప్పించుకునేందుకే కేసును కేవలం గంజాయికి, జగిత్యాల వరకే పరిమితం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.
తెగిన హైదరాబాద్ లింక్
బాధిత బాలిక ఈ నెల 4 నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే స్వధార్ హోంలో ఆశ్రయం పొందుతున్నది. బాధితురాలికి రెగ్యులర్ గా కౌన్సెలింగ్ ఇస్తున్న హోం నిర్వాహకురాలు ఆమె నుంచి తెలుసుకున్న పలు విషయాలను అప్పట్లో మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా నిందితులు బాలికను పలుమార్లు హైదరాబాద్ తీసుకెళ్లినట్టు చెప్పారు. గంజాయి మాత్రమే తీసుకుంటే బాలిక ఆరోగ్యం ఇంతలా క్షీణించేది కాదని, ఆమె కచ్చితంగా డ్రగ్స్ తీసుకుని ఉంటుందనే వార్తలు వచ్చాయి.
కానీ ఆమె నుంచి ఇప్పటివరకూ ఎలాంటి శాంపిల్స్ తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. ఈ క్రమంలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో హైదరాబాద్ లింక్ తెగిపోవడం, కేవలం జిల్లాకు చెందిన ముగ్గురిపైనే కేసు నమోదు చేయడంతో గందరగోళం నెలకొన్నది. బాధితురాలితోపాటు ఆమె తండ్రి, స్వధార్ హోం ఇన్చార్జి వెల్లడించిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసినట్టు ఎఫ్ ఐఆర్ లో పేర్కొన్న పోలీసులు.. బాలికను హైదరాబాద్ ను తీసుకెళ్లినట్టు అదే వ్యక్తులు ముందు నుంచి చెప్తూ వచ్చిన విషయాన్ని మాత్రం వదిలేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సర్కార్, పై ఆఫీసర్ల ఒత్తిళ్ల నేపథ్యంలో త్వరగా కేసును క్లోజ్ చేసేందుకే పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముగ్గురు గంజాయి స్మగ్లర్లు, 10 కిలోల గంజాయి దొరికితేనే మీడియాను పిలిచి వివరాలు వెల్లడించిన జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు.. సంచలనం సృష్టించిన ఈ కేసులో ప్రెస్ నోట్ కే పరిమితం కావడం మరింత అనుమానం పెంచుతున్నది.
బాలిక తండ్రితో బలవంతపు వీడియోలు
జువైనల్ జస్టిస్– - 2015 యాక్ట్, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మైనర్లయిన బాధితుల వివరాలను బయటికి వెల్లడి చేయొద్దనే నిబంధనలు ఉన్నాయి. కానీ గతంలో పని చేసిన పోలీసు అధికారి తన తప్పేంలేదని ఎస్టాబ్లిష్ చేసేందుకు బాధితురాలి తండ్రితో ఓ వీడియో చేయించడం, నిబంధనలకు విరుద్ధంగా ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. మరో యూ ట్యూబ్ చానల్ కూడా ఇదే పద్ధతిలో వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన పోలీస్ అధికారే ఇదంతా చేయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సస్పెన్షన్ లో ఉన్న సదరు సీఐపై శాఖాపరమైన చర్యలకు పోలీస్ శాఖ సిద్ధమవుతున్నట్టు తెలిసింది.