- నియామక పత్రాలు అందించనున్న సీఎం
యాదాద్రి, వెలుగుపోలీసు ఉద్యోగాల్లో యాదాద్రి జిల్లా మార్క్ కనపడనుంది. పోలీసు డిపార్ట్మెంట్లోని వివిధ విభాగాలకు స్టేట్ లెవల్లో 15,750 మంది ఎంపిక కాగా వీరిలో యాదాద్రి జిల్లా నుంచి 438 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరందరికీ ఎల్బీ స్టేడియం వేదికగా సీఎం రేవంత్రెడ్డి బుధవారం నియామక పత్రాలు అందించనున్నారు.
మార్చి 2022లో అప్పటి ప్రభుత్వం పోలీసు నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. 4 అక్టోబర్ 2023 నాటికి పోస్టుల నియామక ప్రక్రియ పూర్తయింది. అయితే కోర్టులో కేసు కారణంగా ఈ ప్రక్రియ పెండింగ్లో పడింది. సెలక్షన్ ప్రాసెస్ పూర్తైన పోస్టులకు నియామక పత్రాలు అందించాలని ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చింది. పైగా జీవో నెంబర్ 46 రద్దు చేయడం సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం వీరందరికీ నియామక పత్రాలు అందించాలని నిర్ణయం తీసుకుంది.
ALSO READ :- టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించిన ఇమ్రాన్ తాహిర్
దీంతో జిల్లా నుంచి పోలీస్ కానిస్టేబుల్, ఎక్సైజ్, అగ్ని మాపక, రవాణా, జైళ్లు శాఖలకు ఎంపికైన 438 మందికి సీఎం రేవంత్రెడ్డి నియామక పత్రాలు అందిస్తారని కలెక్టర్ హనుమంతు జెండగే తెలిపారు. వీరందరికీ ఇప్పటికే సమాచారం ఇచ్చామని, బుధవారం ఉదయం పది బస్సుల్లో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియానికి పంపిస్తామని చెప్పారు.