సంగారెడ్డి, వెలుగు : సీఎం కేసీఆర్ మహారాష్ట్ర టూర్.. సంగారెడ్డి బీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు బయటపెట్టింది. సోమవారం సోలాపూర్ సభలో పాల్గొనేందుకు వెళ్తున్న సీఎంకు స్వాగతం పలికేందుకు మాజీ ఎమ్మెల్యే, హెచ్‌డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం వర్గాలు పోటీపడ్డాయి. పోలీసులు చింతా వర్గాన్ని వదిలేసి మాణిక్యం వర్గాన్ని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయడం వివాదాస్పదమైంది. చింతా ప్రభాకర్ కంది చౌరస్తాలో, పట్నం మాణిక్యం రుద్రారం సమీపంలోని గణేశ్ గడ్డ వద్ద సీఎం స్వాగతం పలికేందుకు కార్యకర్తలను సమీకరించారు.
ALSOREAD:ఐదు వందే భారత్ రైళ్లు.. ఒకేసారి ప్రారంభించిన మోడీ
విషయం తెలుసుకున్న పోలీసులు మాణిక్యంతో పాటు ఆయన అనుచరులను గణేశ్ గడ్డ నుంచి వెళ్లగొట్టేందుకు యత్నించగా కార్యకర్తలు అడ్డుచెప్పారు. రూరల్ సీఐ శివలింగం మాణిక్యానికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. అనంతరం కవలంపేట వద్ద మాణిక్యం అనుచరులు డప్పు చప్పుళ్లతో కేసీఆర్‌కు వెల్‌కమ్ చెప్పారు. ఆ తర్వాత కందిలో చింత ప్రభాకర్ నేతృత్వంలో కార్యకర్తలు సీఎంకు కార్యకర్తలు భారీగా స్వాగతం పలికారు. ఇద్దరు నేతలు ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న విషయం తెలిసిందే. సీఎం దృష్టిలో పడేందుకు కార్యకర్తలతో బలప్రదర్శన చేయడం చర్చనీయాంశమైంది.