- 45 రోజుల్లోపు రావాల్సినవి.. 6 నెలలైనా రావట్లే
సూర్యాపేట వెలుగు: సూర్యాపేట జిల్లాకు చెందిన కానిస్టేబుల్ జిల్లా కేంద్రంలో ఇంటి జాగా రూ.15 లక్షలకు కొనుగోలు చేశారు. ఈ ఏడాది జనవరిలో భద్రత లోన్ కోసం అప్లయ్ చేసుకోగా నేటివరకు మంజూరు కాలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో బయట రూ.2 మిత్తికి డబ్బులు తీసుకున్నారు. ఇంకా లోన్మంజూరు కాకపోవడంతో మిత్తి కట్టలేక సతమతమవుతున్నారు. సూర్యాపేటకి చెందిన పోలీస్ సిబ్బంది ఒకరు రూ.23 లక్షలతో ఇంటిని కొన్నారు. రూ. 4 లక్షలు అడ్వాన్స్ కట్టి ఫిబ్రవరిలో అగ్రిమెంట్ చేయించుకున్నారు. భద్రత స్కీమ్ కింద రూ.19 లక్షల లోన్ కోసం అప్లయ్ చేసుకున్నారు.
లోన్ ఆలస్యమవుతుండడంతో ప్రైవేట్ బ్యాంక్ లో లోన్తీసుకున్నారు. గత నెల చివరిలో లోన్ మంజూరైంది. వచ్చిన డబ్బులతో లోన్ క్లోజ్చేసేందుకు వెళ్లగా దాదాపు రూ. లక్ష పైగా అదనపు వడ్డీ చెల్లించాల్సి వచ్చింది. పోలీసుల శాలరీ ఆధారంగా భద్రత ట్రస్ట్ ద్వారా అందించే లోన్ల కోసం సిబ్బంది నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. 45 రోజులలోపే లోన్లు అందాల్సి ఉండగా ప్రస్తుతం 6 నెలల కంటే ఎక్కువ సమయం పడుతోంది. లోన్వస్తుందన్న నమ్మకంతో ఆస్తులు కొన్నవారు అనుకున్న టైంకు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు బయట అప్పులు చేస్తున్నారు. ఆ తర్వాత లోన్ మంజూరైనప్పటికీ అప్పటికే బయట చేసిన అప్పులకు కట్టిన మిత్తితో తీవ్రంగా నష్టపోతున్నారు.
సిబ్బందికి పోలీస్ భద్రత ట్రస్ట్ ద్వారా ఇచ్చే లోన్ల రుణ పరిమితి గతేడాది భారీగా పెంచుతూ డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా హౌసింగ్ లోన్ వడ్డీ రేటు 7.5 నుంచి 6.5 శాతానికి తగ్గించారు. పిల్లల ఫారిన్ ఎడ్యుకేషన్ లోన్ రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచారు. కానిస్టేబుల్ నుంచి ఏఎస్సై స్థాయి వరకు హౌసింగ్ లోన్ గతంలో రూ. 35 లక్షలు ఉండగా రూ.40 లక్షలకు, ఎస్సై నుంచి సీఐ వరకు రూ. 45 లక్షలు ఉండగా దానిని రూ.50 లక్షలకు పెంచారు. డీఎస్పీ నుంచి ఏఎస్పీ వరకు గతంలో హౌసింగ్ లోన్ రూ.55 లక్షల ఉండేది. ఇప్పుడా పరిమితిని రూ. 60 లక్షలకు, ఐపీఎస్‌లకు రూ.65 లక్షల నుంచి రూ.70 లక్షలకు పెంచారు. ప్లాట్ల కొనుగోలుకు సంబంధించిన లోన్లకు ఏఎస్సై వరకు గతంలో రూ. 20 లక్షలు ఉండగా 25 లక్షలు, సీఐ వరకు రూ. 25 లక్షల నుంచి రూ.30 లక్షలు, ఏఎస్పీ వరకు రూ.30 నుంచి రూ.35 లక్షలు, ఐపీఎస్‌లకు రూ.40 లక్షల నుంచి రూ.45 లక్షలకు లోన్ల లిమిట్ పెంచారు.
నెలల తరబడి పెండింగ్ లో..
పోలీస్ సిబ్బందికి భద్రత లోన్ల పరిమితిని పెంచడంతో సొంత ఇల్లు, జాగాలను కొనుక్కునేందుకు పెద్దఎత్తున సిబ్బంది అప్లయ్ చేసుకుంటున్నారు. 45 రోజులలోపే రుణాలు మంజూరు చేయడం, బ్యాంకుల కంటే తక్కువ మిత్తికే ఇస్తుండడంతో లోన్లు తీసుకునేందుకు ఎక్కువ మంది సిబ్బంది ఆసక్తి చూపుతున్నారు. జిల్లాల్లో గతంలో పదుల సంఖ్యలో అప్లికేషన్లు పెట్టుకోగా ప్రస్తుతం వందలకు చేరాయి. కానీ ప్రస్తుతం లోన్లు సకాలంలో అందకపోవడంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఇల్లు, జాగా కోసం అగ్రిమెంట్ అయ్యాక లోన్ ప్రాసెస్ మొదలు పెడుతుండడంతో సిబ్బంది మొదట అడ్వాన్స్ కట్టి అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. అయితే అప్లై చేశాక సకాలంలో లోన్ మంజూరు కాకపోవడంతో అగ్రిమెంట్ రద్దవుతుందన్న భయంతో బయట నుంచి అధిక మిత్తికి తీసుకువచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నుంచి రుణాల కోసం దాదాపు 2 వేలకు పైగా అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం. అయితే లోన్ త్వరగా శాంక్షన్ అవ్వడానికి కొంతమంది నేతలతో సిబ్బంది పైరవీలు సైతం చేయిస్తుండడం గమనార్హం.
అప్లికేషన్లు పెరగడంతోనే ఆలస్యం
గతంలో కంటే రుణ పరిమితిని పోలీస్ శాఖ పెంచింది. దీంతో ఎక్కువ సంఖ్యలో సిబ్బంది అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. ఎడ్యుకేషన్ లోన్, ఫారిన్ స్టడీస్, పిల్లల పెండ్లి కోసం అప్లయ్ చేసుకున్నవారికి మొదట మంజూరు చేస్తున్నాం. అప్లికేషన్లు ఎక్కువగా రావడంతోనే ఆలస్యం అవుతోంది.
– గోపిరెడ్డి, పోలీస్ సంక్షేమ శాఖ
రాష్ట్ర అధ్యక్షుడు