గణేశ్ శోభాయాత్రకు పటిష్ట భద్రత.. 600 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు

  •     600 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు 
  •     1000కి  పైగా విగ్రహాలు వస్తాయని అంచనా
  •     శోభాయాత్ర సందర్భంగా  ఖమ్మం నగరంలో ట్రాఫిక్​ ఆంక్షలు

ఖమ్మం, వెలుగు : జిల్లాలో  బుధవారం జరగనున్న  వినాయక నిమజ్జనం కోసం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 600 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేపట్టనున్నారు.  ఖమ్మం నగరంలో కాల్వొడ్డు సమీపంలో, ప్రకాశ్ నగర్​ శివారు ప్రాంతంలో మున్నేరు నదిలో విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు.  వైరా, పాలేరు రిజర్వాయర్లతో  పాటు ఆయా గ్రామాల్లోని చెరువుల్లో విగ్రహాల నిమజ్జనం జరగనుంది. ఖమ్మం నగరంలోనే  వెయ్యికి పైగా విగ్రహాలను ఏర్పాటు చేశారు.  

నగరాన్ని ఆనుకొని ఉన్న రఘునాథపాలెం, ఖమ్మం రూరల్​, చింతకాని, ముదిగొండ మండలాల నుంచి మున్నేరుకు విగ్రహాలు వచ్చే అవకాశం ఉంది. దీంతో నగరంలో పోలీసులు ట్రాఫిక్​ ఆంక్షలు విధించారు.  శోభాయాత్ర జరిగే రూట్లు కాకుండా ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ప్రకటన విడుదల చేశారు. శోభాయాత్ర రూట్ మ్యాప్‌ను రిలీజ్‌ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను పెట్టారు.  సీసీ కెమెరాలు, బారికేడ్లను ఏర్పాటు చేశారు. 

ఖమ్మంలో పోలీస్​, రెవెన్యూ, మున్సిపల్​, ఆర్​అండ్​బీ, విద్యుత్​ శాఖలు సమన్వయంతో నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్నారు.  సకాలంలో నిమజ్జనం ముగిసే విధంగా ఉత్సవ కమిటీలు సహకరించాలని అధికారులు చెబుతున్నారు.  నిమజ్జన సమయంలో విగ్రహం వెంట ఇద్దరిని మాత్రమే లోనికి అనుమతిస్తారు. శోభాయాత్రలో సౌండ్​ సిస్టమ్, డీజేల వినియోగంపై నిషేధం విధించారు. డ్రైవర్లు మద్యం తాగి రాకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.  బందోబస్తు కోసం 8 మంది ఏసీపీలు, 17 మంది సీఐలు, 40  మంది ఎస్‌ఐలు, 125 మంది ఏఎస్‌ఐలు, హెడ్​ కానిస్టేబుళ్లు, 281 మంది పోలీస్​ కానిస్టేబుళ్లు, 106 మంది హోంగార్డులు విధులు నిర్వహించనున్నారు.  నిమజ్జనం సందర్భంగా ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాయుడుపేట నుంచి వచ్చే అన్ని వాహనాలను, ములకలపల్లి క్రాస్ రోడ్డు, బైపాస్ రోడ్డు మీదుగా ఖమ్మం టౌన్ లోనికి వెళ్లేలా దారి మళ్లిస్తామని పోలీసులు ప్రకటించారు. 

నగరంలో శోభాయాత్ర మార్గాలు

మామిళ్లగూడెం ఏరియా గణేశ్ విగ్రహాల ఊరేగింపు మయూరిసెంటర్​, కిన్నెర, జడ్పీ సెంటర్​, -చర్చి కాంపౌండ్ -, ప్రకాశ్‌ నగర్, మున్నేరు నిమజ్జనం పాయింట్ లేదా నయాబజార్ మున్నేరు నిమజ్జనం పాయింట్‌కు చేరుకోవాలి. ఆర్టీఏ ఆఫీస్, బ్యాంక్ కాలనీ ప్రాంతం గణేశ్ విగ్రహాల ఊరేగింపు 
ఎన్టీఆర్​ సర్కిల్,- ఇల్లందు క్రాస్​రోడ్​, జడ్పీ సెంటర్-, చర్చి కాంపౌండ్-, ప్రకాశ్‌నగర్‌‌ మున్నేరు నిమజ్జనం పాయింట్ లేదా నయాబజార్ మున్నేరు నిమజ్జనం పాయింట్‌కు చేరుకోవాలని చెప్పారు. రోటరీ నగర్, ఇందిరానగర్ ప్రాంతం నుంచి వచ్చే  వినాయకులను మమత ఎక్స్ రోడ్, ఇల్లందు క్రాస్​రోడ్, -చర్చి కాంపౌండ్ మీదుగా ప్రకాశ్‌ నగర్ చేరుకుంటాయి. 

కస్బా బజార్, కమాన్‌ బజార్ ప్రాంతంలో నుంచి వచ్చే గణేశ్ విగ్రహాల ఊరేగింపు చర్చి కాంపౌండ్, ప్రకాశ్ నగర్ మున్నేరు నిమజ్జనం పాయింట్‌కు చేరుకోవాలి.  గొల్లగూడెం, శ్రీనగర్ కాలనీ, లకారం ట్యాంక్ బండ్ ప్రాంతం నుంచి గణేశ్ విగ్రహాలను ట్యాంక్ బండ్-, టాటా మోటార్స్, చెరువు బజార్-, చర్చి కాంపౌండ్- మీదుగా మున్నేరు నిమజ్జనం పాయింట్‌కు చేరతాయి. శ్రీరామ్ హిల్స్, ముస్తఫా నగర్‌‌ ప్రాంతం నుంచి వినాయకులు ముస్తఫానగర్,- చర్చి కాంపౌండ్,- ప్రకాశ్‌నగర్, మున్నేరు నిమజ్జనం పాయింట్ లేదా నయాబజార్ మున్నేరు నిమజ్జనం పాయింట్‌కు చేరతాయి. 

ఖమ్మం వైరా రోడ్డు ప్రాంతం గణేశ్ విగ్రహాల ఊరేగింపు జడ్పీ సెంటర్, చెర్వుబజార్,- చర్చి కాంపౌండ్-, ప్రకాశ్ నగర్ మున్నేరు నిమజ్జనం పాయింట్ లేదా నయాబజార్ మున్నేరు నిమజ్జనం పాయింట్‌కు చేరుకుంటాయి. సారథి నగర్, గాంధీ చౌక్ ప్రాంతం వచ్చే గణనాథులు గాంధీచౌక్-, నాయుడు సిల్క్స్-, పీఎస్ఆర్​రోడ్-, గుంటిమల్లన్న ఆలయం,- ట్రంక్ రోడ్- నుంచి నయాబజార్ మున్నేరు నిమజ్జనం పాయింట్‌కు చేరతాయి. నిమజ్జనం అనంతరం వాహనాల తిరుగు ప్రయాణానికి పోలీసులు మూడు రూట్‌లను ఏర్పాటు చేశారు.  నిమజ్జన ఏర్పాట్లపై కలెక్టర్​ గౌతమ్​, సీపీ విష్ణు వారియర్​, మున్సిపల్ కమిషనర్​ ఆదర్శ్​ సురభి సమీక్ష చేశారు. కాల్వొడ్డు, ప్రకాశ్​ నగర్​ దగ్గర 
ఏర్పాట్లను తనిఖీ చేశారు.

నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తిభద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ వినీత్​

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు:  భద్రాచలంలోని గోదావరిలో గణేశ్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి  చేశామని ఎస్పీ డాక్టర్​ వినీత్​ మంగళవారం పేర్కొన్నారు.  నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.  కొత్తగూడెం, పాల్వంచ, మీదుగా భద్రాచలం వచ్చే వినాయక విగ్రహాలను నిమజ్జనానికి తీసుకెళ్లే  వెహికిల్స్ కు ఎలాంటి ట్రాఫిక్​ ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు.  నిమజ్జనం ఊరేగింపులో మద్యం సేవించి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.