- ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
ఆదిలాబాద్ నెట్వర్క్, వెలుగు: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. శనివారం రామగుండం కమిషనరేట్ లో జరిగిన వేడుకల్లో కమిషనర్ రెమా రాజేశ్వరి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉగ్రవాదులు, అసాంఘిక శక్తులతో పోరాడి అసువులు బాసిన అమరవీరుల పేర్లను స్మరించుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివన్నారు. ప్రజల, దేశ రక్షణలో ప్రాణం కంటే విధి నిర్వహణ గొప్పదని చాటిన అమరుల త్యాగాలు చిరస్మరణీయమన్నారు. ఈ సందర్భంగా పోలీస్ వెల్ఫేర్ క్యాంటీన్‌ను ప్రారంబించారు. కార్యక్రమంలో ఏసీపీలు తుల శ్రీనివాస్ రావు, మల్లారెడ్డి, రాజేశ్, నరసింహులు, వెంకటేశ్వర్లు, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
అమరుల ఆశయ సాధనకు కృషి చేయాలి
సమాజంలో శాంతిభద్రతలు కాపాడడంలో పోలీసుల పాత్ర విలువైందని మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్అన్నారు. అమరుల ఆశయసాధనకు ప్రజలు, పోలీసులు కృషి చేయాలని సూచించారు. పోలీసుల అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మందమర్రి పోలీస్స్టేషన్ఆవరణలోని అమరుల స్థూపం వద్ద బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్యతో కలిసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ పోలీసుల త్యాగం వెలకట్టలేనిదని, విధి నిర్వహణలో కొందరు పోలీసులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. శాంతియుత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.
త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి
పోలీస్ అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని నిర్మల్ కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, ఎస్పీ చల్లా ప్రవీణ్ కుమార్ అన్నారు. స్మారక వారోత్సవాల కార్యక్రమానికి వీరు చీఫ్ గెస్ట్లుగా హాజరై అమరవీరుల స్మారకార్థంకాగడాను వెలిగించి స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ దేశ రక్షణలో సైనికులు ఎంత కీలకమో, రాష్ట్ర రక్షణలో పోలీసులు అంతే కీలకమన్నారు.
భద్రత విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. పోలీసుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని, అమరవీరుల కుటుంబాలకు అన్ని రకాలుగా అండగా నిలుస్తామన్నారు. అనంతరం పోలీసులు రక్తదాన శిబిరం నిర్వహించారు. దీనికి ముందు నిర్మల్‌లో పోలీసు అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ ఎస్పీ నేతృత్వంలో ర్యాలీ నిర్వహించారు.
అమరుల త్యాగాలు చిరస్మరణీయం
పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో అమరవీరుల ఫొటోలతో ఏర్పాటు చేసిన స్తూపం వద్ద కలెక్టర్, జిల్లా అడిషనల్ సెషన్స్ జడ్జి డా.శివరాం ప్రసాద్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఫారెస్ట్ ముఖ్య అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్, జిల్లా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ సంఘటనల్లో అసాంఘిక శక్తులతో పోరాడి అసువులు బాసిన 189 మంది అమరవీరుల పేర్లను స్మరించుకుంటూ వారి జ్ఞాపకార్థం ఆత్మకు శాంతి చేకూర్చాలని నివాళి ఘటించారు. అమరవీరుల కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి కలెక్టరేట్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.
పోలీస్ అమరవీరుల సేవలు చిరస్మరణీయం
ఆసిఫాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన కార్యక్రమానికి కలెక్టర్ హేమంత్ సహదేవురావు గెస్ట్‌గా హాజరయ్యారు. పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భం గా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సేవలు చిరస్మరణీయమన్నారు. సిర్పూర్ కాగజ్ నగర్, ఆసిఫాబాద్ ప్రాంతంలో 1995 నుంచి 14 మంది పోలీసులు శాంతి భద్రతల కోసం ప్రాణ త్యాగం చేశారని అన్నారు. అమరవీరుల కుటుంబ సభ్యులను శాలువాతో సన్మానించి, బహుమతులు అందించారు. అడిషనల్ ఎస్పీ అచ్చేశ్వర్ రావు, డీఎస్పీలు వెంకటరమణ, కరుణాకర్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.