ఇవాళ పోలీసుల మెగా జాబ్ మేళా..ఎంపికైన వారికి10- 80 వేల వరకు వేతనాలు

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: పోలీసుల ఆధ్వర్యంలో ఈనెల 21న ఎస్ బీఐటీ ఇంజినీరింగ్​కాలేజీలో జాబ్​మేళాకు నిర్వహిస్తున్నట్లు ఖమ్మం సీపీ విష్ణు వారియర్​తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగ యువతకు ప్రైవేట్, కార్పొరేట్ కంపెనీల్లో ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ జాబ్​మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 14వేల మంది నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. 140 కంపెనీల్లో 8150 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవకాశముందన్నారు. టెన్త్​నుంచి డిగ్రీ, పీజీ వరకు చదివినవారికి కూడా ఉద్యోగ, ఉపాధి కల్పించనున్నారని తెలిపారు.

ఎంపికైన వారికి రూ.10వేల నుంచి రూ.80వేల వరకు వేతనాలు వచ్చే అవకాశం ఉందన్నారు. సాఫ్ట్, కమ్యూనికేషన్ స్కిల్స్​ఉన్నవారికి అధిక శాలరీ ఆఫర్ ఇచ్చేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయన్నారు. అనేక కంపెనీలు వస్తున్నందున కనీసం10 రెస్యూమ్​లతో సిద్ధంగా ఉండాలని సూచించారు. సమావేశంలో అడిషనల్​ డీసీపీ సుభాశ్​చంద్రబోస్, ఏసీపీలు గణేశ్, బస్వారెడ్డి, రామోజీ రమేశ్, రెహమాన్, ప్రసన్నకుమార్, వెంకటేశ్వర్లు, వెంకటస్వామి, సీఐ తుమ్మా గోపి పాల్గొన్నారు.