- ట్రాఫిక్‌ను పట్టించుకోని పోలీసులు
- స్టేషన్ల వారీగా టార్గెట్ ఇస్తున్న ఆఫీసర్లు
సూర్యాపేట, వెలుగు : ట్రాఫిక్ పోలీసులు తమ అసలు పని వదిలేసి ఫొటోగ్రాఫర్ల అవతారం ఎత్తడంతో బండి బయటకు తీయాలంటేనే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రధాన జంక్షన్లతో పాటు, పలు చోట్ల కెమెరాలతో కూర్చుంటున్న ట్రాఫిక్ పోలీసులు రూల్స్ పాటించకుండా ఎవరైనా కనిపిస్తే చాలు ఠక్కున ఫొటో తీసి చలాన్ జారీ చేస్తున్నారు. ప్రతి ట్రాఫిక్ కానిస్టేబుల్ రోజుకు 20 ఫొటోలు తీయాలని టార్గెట్ పెట్టడంతో వారు ట్రాఫిక్ క్లియరెన్స్‌ను పక్కన పెట్టి ఫొటోలు తీయడంపైనే ఫోకస్ చేస్తున్నారు. సూర్యాపేట జిల్లావ్యాప్తంగా లక్షలాది చలాన్లు పెండింగ్‌లో ఉండడంతో పోలీసులు ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు.
పెండింగ్‌లో రూ.17.40 కోట్లు
సూర్యాపేట జిల్లాలో గత నెల వరకు మొత్తం 7,18,363 కేసులు నమోదు కాగా, రూ.34.72 కోట్ల ఫైన్ విధించారు. వీటిలో 3.32 లక్షల మంది వాహనదారులు రూ.11.68 కోట్లు చెల్లించారు. ఇంకా 3.86 లక్షల మంది నుంచి రూ.17.40 కోట్లు వసూలు కావాల్సి ఉంది. సూర్యాపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 56 శాతం వసూళ్లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా, 54 శాతం వసూళ్లతో కోదాడ ట్రాఫిక్ పోలీసులు రెండో స్థానంలో నిలిచారు. హెల్మెట్ లేకుండా బండి నడిపే వారికే ఎక్కువ ఫైన్లు పడ్డాయి.
స్టేషన్ల వారీగా టార్గెట్
ట్రాఫిక్ రూల్స్ పాటించిని వారిని ఫొటో తీసి చలాన్ జారీ చేసేందుకు స్టేషన్ల వారీగా కానిస్టేబుళ్లకు టార్గెట్ పెడుతున్నారు. ఒక్కో కానిస్టేబుల్ కనీసం 20 ఫోటోలు తీయాలని చెబుతున్నారు. దీంతో వారు ట్రాఫిక్ పట్టించుకోకుండా రూల్స్ పాటించని వారు ఎక్కడ దొరుకుతారా అని వెదుకుతున్నారు. దీంతో పట్టణంలోని ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఫైన్లు వేయడంపైనే కాకుండా ట్రాఫిక్‌ను క్లియర్ చేసే విషయాన్ని కూడా పట్టించుకోవాలని ప్రజలు సూచిస్తున్నారు.
ముక్కు పిండి మరీ వసూళ్లు
పెండింగ్ చలాన్ల వసూళ్లపై పోలీసులు దృష్టి పెట్టారు. ఎక్కడైనా బైక్‌ను ఆపారంటే చాలు పాత ఫైన్లు ఎన్ని ఉన్నాయో లెక్క తీస్తున్నారు. ఆ ఫైన్లు కట్టిన తర్వాతే బండిని వాహనదారుడికి అప్పగిస్తున్నారు. ఒక వేళ ఫైన్ కట్టకపోతే బైక్‌ను సీజ్ చేస్తున్నారు.