హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మాసబ్ ట్యాంక్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. బంజారాహిల్స్ సీఐ విధులు అడ్డుకోవడం, బెదిరింపుల వ్యవహారంలో కౌశిక్ రెడ్డిపై మాసబ్ ట్యాంక్ పీఎస్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో 2025, జనవరి 16న విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు పంపారు. అయితే.. రేపు (జనవరి 16) కరీంనగర్ కోర్టుకు హాజరుకావాల్సి ఉందని, ఈనెల 17న విచారణకు హాజరవుతానన్న కౌశిక్ రెడ్డి పోలీసులకు రిప్లై ఇచ్చారు.
కాగా, ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేస్తోందని కంప్లైంట్ చేసేందుకు 2024 డిసెంబర్ 4వ తేదీన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పీఎస్‌కు వెళ్లారు. ఇంతలోనే వేరే పనిమీద బంజారాహిల్స్ సీఐ బయటకు వెళ్తుండగా కౌశిక్ రెడ్డి అడ్డుకున్నాడు. తన ఫిర్యాదు స్వీకరించాక వెళ్లాలని కోరాడు. దీంతో అర్జెంట్ పని ఉండడంతో తిరిగి వచ్చి తీసుకుంటానని బయటకు వెళ్లేందుకు సీఐ యత్నించగా కౌశిక్ రెడ్డితో మరి కొందరు బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు.
ALSO READ | బనకచర్ల ప్రాజెక్ట్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖలు రాయండి:అధికారులకు CM రేవంత్ ఆదేశం
కౌశిక్ రెడ్డి తీరుపై బంజారాహిల్స్ సీఐ మాసబ్ ట్యాంక్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. విధులకు ఆటంకం కలిగించడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. బంజారాహిల్స్ సీఐ కంప్లైంట్ మేరకు మాసబ్ ట్యాంక్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే విచారణకు రావాలని కౌశిక్ రెడ్డికి సమన్లు పంపారు.