హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి బొంరాస్ పేట పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాంగ్రెస్ నేత శేఖర్‌పై రోటిబండ తండా వాసుల దాడి ఘటనలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 2025, జనవరి 2వ తేదీన బొంరాస్ పేట పీఎస్‌కు రావాలని పోలీసులు ఆదేశించారు. ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేయకుండా పట్నం నరేందర్ రెడ్డి ఇప్పటికే ముందస్తు బెయిల్ పొందారు. కాగా, కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో అధికారులపై దాడి ఘటన తెలంగాణ పాలిటిక్స్‌ను షేక్ చేసిన విషయం తెలిసిందే.
Also Read : ఎక్స్‌పోర్టుకు అన్ని వసతులు కల్పిస్తాం
లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై అభిప్రాయ సేకరణకు వెళ్లిన అధికారులపై గ్రామస్తులు దాడి చేయడం సంచలనం సృష్టించింది. ఈ దాడికి మాస్టర్ మైండ్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డేనని ఆరోపించిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ కేసులో దాదాపు నెల రోజుల పాటు పట్నం చర్లపల్లి జైలులో ఉన్నారు. అనంతరం హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుండి బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే మరో కేసులో నరేందర్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇవ్వడం గమనార్హం.