హైదరాబాద్: మంచు ఫ్యామిలీ లొల్లి రచ్చ రచ్చగా మారింది. మొన్న ఒకరిపై మరొకరు పరస్పరం కేసులు పెట్టుకోగా.. ఇవాళ ఏకంగా దాడులు చేసుకునే వరకు వెళ్లింది. మంచు ఫ్యామిలీ వార్ మరింత ముదిరి పీక్ స్టేజ్‌కు వెళ్లింది. ఇదిలా ఉండగానే.. మంచు కుటుంబ పంచాయతీ వ్యవహారంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. మోహన్ బాబు ఆయన ఇద్దరూ కుమారులు విష్ణు, మనోజ్‌కు రాచకొండ సీపీ నోటీసులు జారీ చేశారు. 2024, డిసెంబర్ 11వ తేదీ ఉదయం 10:30కి వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు.
అదనపు జిల్లా మేజిస్ట్రేట్ హోదాలో రాచకొండ సీపీ ఈ నోటీసులు జారీ చేశారు. మంగళవారం (డిసెంబర్ 10) రాత్రి జల్ల్ పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద జరిగిన హైడ్రామా, జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి ఘటనపై సీపీ విచారణ చేయనున్నట్లు తెలిసింది. మంచు ఫ్యామిలీ వార్ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు మోహన్ బాబు, మనోజ్, విష్ణు గన్ లైన్స్ ను హోల్డ్ లో పెట్టి.. వారి నుండి తుపాకులు సీజ్ చేశారు. తాజాగా విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేయడంతో మంచు ఫ్యామిలీ వార్ ఎపిసోడ్లో నెక్ట్స్ ఏం జరగబోతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
కాగా, 2024, డిసెంబర్ 10వ తేదీన జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మోహన్ బాబు నివాసానికి ఆయన కుమారుడు మనోజ్ వచ్చాడు. విభేదాల నేపథ్యంలో మనోజ్‌ను ఇంట్లోకి రానివ్వకుండా మోహన్ బాబు సిబ్బంది గేట్లు క్లోజ్ చేశారు. సిబ్బందితో వాగ్వాదానికి దిగిన మనోజ్.. చివరకు గేట్లు తోసుకుని బలవంతంగా ఇంట్లోకి వెళ్లాడు. మోహన్ బాబు ఇంటి దగ్గర జరిగిన ఈ హైడ్రామాను కవరేజ్ చేసేందుకు మీడియా వెళ్లింది. ఈ క్రమంలోనే ఇంట్లోకి వచ్చిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడికి పాల్పడ్డాడు.
బూతులు తిడుతూ జర్నలిస్టుల చేతిలోని మైక్‌ను తీసుకుని దాడి చేశాడు. మోహన్ బాబు దాడిలో ఇద్దరు జర్నలిస్టులు గాయపడ్డారు. దీంతో మీడియాపై దాడికి పాల్పడిన మోహన్ బాబుపై పలువురు జర్నలిస్టులు, మీడియా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అహంకారిపూరిత ధోరణితో మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడిన ఆయన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే ఆందోళనకు దిగుతామని ఇప్పటికే పలు జర్నలిస్టు సంఘాలు ప్రకటించాయి.