
గాంధీనగర్: ప్రధాని మోడీ తన సొంత రాష్ట్రం గుజరాత్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం (మార్చి 7) సూరత్‌లోని లింబాయత్‌లో జరగనున్న ఓ సభలో ఆయన పాల్గొననున్నారు. ప్రధాని మోడీ రాక నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా లింబాయత్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా లింబాయత్‌లో ప్రధాని మోడీ కాన్వాయ్ ప్రయాణించనున్న ప్రాంతంలో గురువారం (మార్చి 6) రిహార్సల్ డ్రిల్ నిర్వహించారు.
ఈ సమయంలో ఓ బాలుడు రిహార్సల్ నిర్వహిస్తోన్న రోడ్డుపైకి సైకిల్‌పై సడెన్‌గా వచ్చాడు. దీంతో ప్రధాని మోడీ భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తోన్నపోలీస్ అధికారి బిజె గధ్వి తీవ్ర ఆగ్రహానికి గురై బాలుడిపై దాడి చేశాడు. బాలుడి మొఖంపై పోలీస్ అధికారి దాడి చేసిన ఘటన మొత్తం అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలుడి పట్ల పోలీస్ ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి.
దీంతో నష్ట నివారణ చర్యలకు దిగిన పోలీసులు బాలుడిపై దాడి చేసిన పోలీస్ ఆఫీసర్‌పై చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు బిజె గధ్విని ప్రధాని భద్రతా ఏర్పాట్ల విధుల నుంచి తొలగిస్తూ మోర్బీకి బదిలీ చేసినట్లు తెలిపారు. అలాగే.. బాలుడిపై దాడి చేసిన గధ్వి ఇంక్రిమెంట్‌ను సంవత్సరం పాటు నిలిపివేసినట్లు వెల్లడించారు. ఇటువంటి చర్యలను ఏ మాత్రం ఉపేక్షించమని హెచ్చరించారు.