
- రాష్ట్రపతి భవన్ లోపల, బయట మూడంచెల భద్రత
- 5 కంపెనీల పారా మిలిటరీ బలగాలు, ఎస్ఎస్జీ కమాండోల మోహరింపు
- విధుల్లో 2500 కంటే ఎక్కువ మంది పోలీస్ పర్సనల్స్
న్యూఢిల్లీ : ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవన్చుట్టూ 5 కంపెనీల పారా మిలిటరీ సిబ్బంది, ఎన్ఎస్జీ కమాండోలు, స్నిప్పర్స్ తో కూడిన బహుళస్థాయి భద్రతను కల్పించారు. డ్రోన్ కెమెరాలతో పకడ్బందీ నిఘాపెట్టారు. 5 కంపెనీల పారామిలిటరీ దళాలు, ఢిల్లీ ఆర్మ్డ్ పోలీస్ (డీఏపీ) జవాన్లుసహా2500 కంటే ఎక్కువ మంది పోలీస్ పర్సనల్స్‌ను మోహరించినట్టు ఢిల్లీ పోలీస్ ఆఫీసర్ ఒకరు వెల్లడించారు. ట్రాఫిక్‌పై ఆంక్షలు విధించడంతోపాటు డైవర్షన్ చేపట్టామని, బారికేడ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. లా అండ్ ఆర్డర్‌ను ఎవరూ ఉల్లంఘించకుండా పటిష్ట చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.
దేశ రాజధానిలో హై అలర్ట్
సౌత్ ఏషియన్అసోసియేషన్ ఫర్ రీజినల్ కో ఆపరేషన్(సార్క్) దేశాల నుంచి ప్రముఖులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందున దేశరాజధానిని హై అలర్ట్ చేసినట్టు తెలిపారు. అతిథులు హోటల్స్నుంచి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు ఆ మార్గంలో సాధారణ ట్రాఫిక్‌ను నిలిపివేసినట్టు చెప్పారు. డైవర్టెడ్ రూట్స్‌ను ముందుగానే ప్రకటించినట్టు తెలిపారు. “వివిధ దేశాలనుంచి ముఖ్య నేతలు మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్నారు. వీరు బసచేయనున్న హోటల్స్వద్ద సెక్యూరిటీని కట్టుదిట్టం చేశాం” అని పేర్కొన్నారు. అన్ని రూట్లను ఢిల్లీ పోలీస్, ఎన్ఎస్జీ కమాండోలు చెక్చేశారని, రాష్ట్రపతి భవన్, ఇతర వ్యూహాత్మక ప్రదేశాల చుట్టూ భద్రతా సిబ్బందిని మోహరించినట్టు మరో పోలీసు అధికారి తెలిపారు. రాష్ట్రపతి భవన్ప్రాంగణం లోపల, బయట మూడంచెల భద్రత ఉంటుందని పేర్కొన్నారు. పారామిలిటరీ సిబ్బంది ప్రాంగణం లోపల, ఢిల్లీ పోలీసు సిబ్బంది బయట, స్నిపర్లు, సాయుధ పోలీసు సిబ్బంది ప్రముఖులు వెళ్లే మార్గాల్లో మోహరించినట్టు తెలిపారు. ఇది నిరుడు జరిగి జీ20 శిఖరాగ్ర సమావేశానికి సంబంధించి భద్రతను పోలి ఉంటుందని పేర్కొన్నారు.