భూపాలపల్లి అర్భన్, వెలుగు : రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని తెలంగాణ, చత్తీస్గఢ్, మహారాష్ట్ర పోలీస్ ఆఫీసర్లు నిర్ణయించారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జెన్కో కాన్ఫరెన్స్ హాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ పుల్లా కరుణాకర్ ఆధ్వర్యంలో మూడు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల సమన్వయ సమావేశం, అంతర్ జిల్లా పోలీస్ఉన్నతాధికారుల మీటింగ్ నిర్వహించారు.
ALSO READ: గిరిజన బంధు ఏడవాయే?..ప్రకటించి ఏడాదైనా అమలు చేయని సర్కారు
మావోయిస్టుల కదలికలు, ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చించారు. ముఖ్యంగా మావోయిస్టుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచి సమాచారాన్ని పరస్పరం చేరవేసుకోవాలని నిర్ణయించారు. రామగుండం సీపీ రెమా రాజేశ్వరి, ములుగు ఎస్పీ గౌస్ ఆలం, కొమురం భీం ఆసిఫాబాద్ ఎస్పీ కే సురేశ్ కుమార్, వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ పి రవీందర్, మంచిర్యాల డీసీపీ సుధీర్ ఆర్ కేకెన్ , ములుగు ఓఎస్డీ అశోక్ కుమార్ పాల్గొన్నారు.