విశిష్ట సేవలందించిన పోలీసులకు మెడల్స్

విశిష్ట సేవలందించిన పోలీసులకు మెడల్స్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పోలీస్​ శాఖలో విశిష్ట సేవలందించిన ఆఫీసర్స్, సిబ్బందికి ఎస్పీ బి. రోహిత్​ రాజు మెడల్స్​ అందజేశారు. హేమచంద్రాపురంలోని పోలీస్ హెడ్ ​క్వార్టర్స్​లో శుక్రవారం నిర్వహించిన ప్రోగ్రామ్​లో ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్​ శాఖలో సేవలందించిన జిల్లాలోని 260 మందికి ఇటీవల మెడల్స్​ను ప్రకటించిందని తెలిపారు. కఠిన సేవా, ఉత్తమ సేవా, సేవా పతకాలతో పాటు యాంత్రిక్​ సురక్షా సేవా పతకాలను అందజేయడం ఆనందంగా ఉందన్నారు.

శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. డ్యూటీలతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ పోలీసులు ముందుండడం అభినందనీయమన్నారు. ప్రోగ్రామ్​కు ముందు జరిగిన పరేడ్​లో 15 రోజుల పాటు సాగిన జిల్లా ఆర్మ్​డ్​ రిజర్వ్​ సిబ్బంది మొబిలైజేషన్​ ముగింపు సందర్భంగా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్​ శాఖలో పనిచేస్తూ రిటైర్​ అయిన పలువురు పోలీస్​ ఆఫీసర్లను ఎస్పీ సన్మానించారు. ఈ ప్రోగ్రామ్​లో ఏఆర్​డీఎస్పీ సత్యనారాయణ, ఎస్బీ సీఐలు నాగరాజు, శ్రీనివాస్, అడ్మిన్​ఆర్ఐ లాల్​బాబు, హోంగార్డ్స్​ ఆర్ఐ కృష్ణారావు, ఆర్ఐ నర్సింహరావు, ఎంటీవో సుధాకర్, వెల్ఫేర్​ఆర్ఐ కృష్ణారావు పాల్గొన్నారు.