- కామారెడ్డి జిల్లా పోలీసు శాఖ వినూత్న ఆలోచన
- విద్యార్థులతో ప్రజల్ని చైతన్యపరిచేందుకు కార్యాచరణ
- వెయ్యిమందితో స్టూడెంట్ సేఫ్టీ క్లబ్ ఏర్పాటు
కామారెడ్డి జిల్లా పోలీసు శాఖ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. రోజురోజుకు పెరుగుతున్న నేరాల కట్టడికి ప్రజల్ని చైతన్య పరిచేసేందుకు విద్యార్థుల్ని భాగస్వామ్యం చేస్తోంది. వారితో విషయాన్ని చెప్పించటం ద్వారా ప్రజల్లో ఆలోచనా ధోరణి మారుతుందని పోలీసు ఉన్నతాధికారుల భావన. ప్రధానంగా సైబర్ క్రైమ్, ఈవ్‌టీజింగ్, రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు, యువత పెడదారిన పట్టకుండా పోలీసు శాఖ చేపట్టే సరికొత్త కార్యక్రమం ఫలితాలు ఇస్తుందని ఆ శాఖ ఉన్నతాధికారుల ఆలోచన. ప్రజల్లో అవగాహన వస్తేనే సైబర్ క్రైమ్నియంత్రించవచ్చని చెబుతున్నారు. సైబర్క్రైమ్స్బారిన పడకుండా ఉండేందుకు ఇప్పటికే పోలీసు శాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
కామారెడ్డి, వెలుగు: నేరాల కట్టడికి విద్యార్థుల్ని భాగస్వామ్యం చేస్తే వారు తమ కుటుంబ సభ్యులతో పాటు, చుట్టు పక్కల వారిని చైతన్య పరుస్తూ ప్రజల ఆలోచన ధోరణి మార్చవచ్చని పోలీసు ఆఫీసర్లు చెబుతున్నారు. విద్యార్థుల ద్వారా చెబితే తాము చెప్పాలనుకున్న విషయం స్పష్టంగా ప్రజలకు చేరుతుందనేది ఎస్పీ సింధూశర్మ భావన. కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదాల నివారణకు 122 మంది స్కూల్స్టూడెంట్స్ను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించగా తాజాగా వెయ్యి మంది కాలేజీ స్టూడెంట్స్‌తో సేప్టీ క్లబ్‌లను ఏర్పాటు చేశారు.
కామారెడ్డి జిల్లా రాజధానికి దగ్గర ఉండటమే కాకుండా విద్య, వ్యాపారపరంగా అభివృద్ధి చెందుతోంది. నేరాలు కూడా ఎక్కువే. ఈ ఏడాదిలో ఇప్పటికే జిల్లాలో 4500 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఇందులో సైబర్ క్రైమ్స్‌కు సంబంధించి అక్టోబర్ చివరినాటికి 860 ఫిర్యాదులు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి మాయమాటలు చెప్పి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాయని, పోలీసు ఆఫీసర్లమని చెబుతూ మాట్లాడుతుండటంతో నిజమేనని నమ్మి చాలా మంది తమ అకౌంట్ల వివరాలు చెప్పి డబ్బులు పొగొట్టుకున్నారు.
బాధితుల్లో నిరక్ష్యరాసులతో పాటు, చదువుకున్న వారు కూడా ఉన్నారు. పోలీసు శాఖ ద్వారా నిరంతరం గ్రామాలు, స్కూల్స్, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినా సైబర్ క్రైమ్స్తగ్గడంలేదు. నేరాల నియంత్రణకు ఆరు సేప్టీ క్లబ్‌లు ఏర్పాటు చేశారు. జిల్లాలో 21 కాలేజీల్లో వెయ్యి మంది క్లబ్ మెంబర్స్‌ను నియమించారు. క్లబ్లో స్టూడెంట్స్, లెక్చరర్, తల్లిదండ్రులు కలిపి పది మంది ఉంటారు. ఇందులో స్టే సైబర్ సేప్టీ క్లబ్, రోడ్ సేప్టీ క్లబ్, ఉమెన్సెఫ్టీ క్లబ్, సోషల్ రెస్పాన్సిబిలిటీ క్లబ్, యాంటీ ర్యాంగింగ్, డ్రగ్కమిటీ క్లబ్, హెల్త్, వెల్నెస్ క్లబ్‌లు ఉన్నాయి.
మెంబర్లకు అవగాహన కల్పించి..
ఆయా క్లబ్బుల్లో మెంబర్లుగా చేరిన స్టూడెంట్స్‌కు పలు అంశాలపై అవగాహన కల్పిస్తారు. యాక్సిడెంట్ల నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఎలా ఉండాలి, ఫోన్ నంబర్లు, బ్యాంక్ అకౌంట్ నంబర్లు, ఓటీపీలు గుర్తు తెలియని వ్యక్తులకు చెప్పకుండా జాగ్రత్తలు తీసుకోవటం, మహిళలను, స్టూడెంట్స్‌ను వేధించకుండా చూడటం వంటి వాటిపై చెబుతున్నారు.
క్లబ్ మెంబర్లు మిగతా స్టూడెంట్స్‌కు తమ ఇండ్లు, చుట్టూ పక్కల వారికి గ్రామాల్లో తెలియజెప్పాలి. సైబర్ క్రైమ్ జరిగితే వెంటనే ఎవరికి ఫిర్యాదు చేయాలి, అమ్మాయిలను వేధిస్తే షీటీమ్స్‌కు ఫిర్యాదు చేయటం వంటి అంశాలు చెబుతారు. డ్రగ్స్ రవాణాతో కలిగే నష్టాలు, భవిష్యత్‌పై ఏవిధంగా ప్రభావం చూపుతుందనేది తెలియజెబుతారు.
విద్యార్థుల ద్వారా ఎక్కువ మందిని ఆకర్షించవచ్చు
ఏదైనా అంశాన్ని విద్యార్థులు చెబితే ఎక్కువ మందిని ఆకర్షిస్తుంది. క్లబ్లో మెంబర్లుగా చేరిన వాళ్లు ఇక్కడ నేర్చుకున్న అంశాలు తమ ఇంట్లో వారితో పాటు, చుట్టు పక్కల వారికి తెలియజెప్పటం ద్వారా త్వరగా ప్రజల్లోకి వెళ్లగలుగుతుంది. తద్వారా ప్రజల్లో మార్పు వస్తే సైబర్ క్రైమ్, రోడ్డు ప్రమాదాలు నివారించొచ్చు. – సింధూశర్మ, ఎస్పీ-కామారెడ్డి