రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
  • మండలాలను దత్తత తీసుకున్న ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, డీఎస్పీలు
  • నల్గొండ జిల్లా పోలీసుల వినూత్న కార్యక్రమం 
  • ఎక్కువ ఆక్సిడెంట్లు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి 
  • భద్రతా చర్యలు తీసుకుంటున్న పోలీస్​ అధికారులు

నల్గొండ, వెలుగు : రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్​అధికారులు చర్యలు తీసుకున్నారు. జిల్లా పోలీస్​అధికారులు చేపట్టిన మండలాల దత్తత కార్యక్రమంతో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పడుతున్నాయి. నిత్యం రోడ్డు ప్రమాదాల బారిన పడి జిల్లాలో ఏటా వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాల నియంత్రణపై నల్గొండ పోలీస్ శాఖ దృష్టి పెట్టింది. జిల్లాలోని వివిధ మండలాలను పోలీసులు దత్తత తీసుకున్నారు.

ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో స్పీడ్ కంట్రోల్ బోర్డులు, స్టడ్‌‌‌‌‌‌‌‌లు, బ్లింకింగ్ లైట్లు, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయడంతో యాక్సిడెంట్ల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఆలయాలు, బస్టాప్‌‌‌‌‌‌‌‌లు వద్ద పాదచారులు ప్రమాదానికి గురయ్యే ప్రాంతాలపై కూడా పోలీసులు దృష్టి సారిస్తున్నారు. 

మండలాలను దత్తత తీసుకున్న పోలీసులు..

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం జిల్లా పోలీస్ యంత్రాంగం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎస్పీ నుంచి డీఎస్పీ స్థాయి వరకు మండలాలను దత్తత తీసుకొని ఎక్కువగా యాక్సిడెంట్లు జరిగే ప్రాంతాలను గుర్తించి భద్రతా చర్యలు చేపట్టారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ తోపాటు అడిషనల్ ఎస్పీ, డీఎస్పీలు జిల్లాలోని పలు మండలాలను దత్తత తీసుకొని రోడ్డు ప్రమాదాల నివారణకు కార్యాచరణ చేపట్టారు.

నల్గొండ మండలాన్ని ఎస్పీ దత్తత తీసుకోగా, అడిషనల్ ఎస్పీ వేములపల్లి మండలం, నల్గొండ డీఎస్పీ కేతేపల్లి మండలం, మిర్యాలగూడ డీఎస్పీ మిర్యాలగూడ మండలం, దేవరకొండ డీఎస్పీ చింతపల్లి మండలాన్ని దత్తత తీసుకున్నారు. 

తగ్గుతున్న రోడ్డు ప్రమాదాలు..

దత్తత తీసుకున్న మండలాల్లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో స్పీడ్ కంట్రోల్ బోర్డులు, స్టడ్‌‌‌‌‌‌‌‌లు, బ్లింకింగ్ లైట్లు, రేడియం స్టిక్కర్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను నేషనల్ హైవే అధికారులు, ఆర్ అండ్ బీ, పోలీసులు ప్రతి వారం సందర్శిస్తున్నారు. ప్రమాదాల నివారణకు ఉన్నతాధికారులకు ప్రతి వారం రిపోర్ట్ పంపుతూ రోడ్డు ప్రమాదాలపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ALSO READ : ఓఆర్​ఆర్​పై హరీశ్​ వర్సెస్​ పొంగులేటి

పోలీసులు చేపడుతున్న చర్యలతో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో జిల్లాలో 53 బ్లాక్ స్పాట్స్ ఉండగా, ఈ ఏడాది 17 బ్లాక్ స్పాట్స్ తగ్గినట్లు గుర్తించారు. దత్తత తీసుకున్న ఐదు మండలాల్లో.. ప్రతి మండలంలో రెండు బ్లాక్ స్పాట్స్ తగ్గాయి.

దత్తతతో తగ్గుముఖం పట్టిన యాక్సిడెంట్లు 

మండలాలను దత్తత తీసుకొని రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడంతో జిల్లాలో యాక్సిడెంట్లు ఈసారి బాగా తగ్గాయి. ప్రతి వారం రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను ఆర్ అండ్ బీ అధికారులతో పరిశీలించి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడుతున్నాం.  

- శరత్ చంద్ర పవార్, నల్గొండ ఎస్పీ