పోలీసులు ఉన్నా.. కలెక్టర్ వెంట ఎందుకు వెళ్లలేదు : ఏడీజీ మహేశ్ భగవత్

పోలీసులు ఉన్నా.. కలెక్టర్ వెంట ఎందుకు వెళ్లలేదు : ఏడీజీ మహేశ్ భగవత్

పరిగి పీఎస్​లో ఏడీజీ మహేశ్ భగవత్ విచారణ 

హైదరాబాద్/పరిగి, వెలుగు: లగచర్ల ఘటనపై పోలీసు అధికారులు ఉన్నత స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు. అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్) మహేశ్ భగవత్ ఆధ్వర్యంలో సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్నారు. వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డితో పాటు పోలీసు సిబ్బంది నుంచి వివరాలు సేకరిస్తున్నారు. న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా సాంకేతిక ఆధారాలతో పాటు మొబైల్ కాల్ డేటా, ప్రత్యక్ష సాక్షుల స్టేట్ మెంట్స్ రికార్డ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా అడిషనల్ డీజీ మహేశ్​భగవత్​గురువారం పరిగి వెళ్లారు. 

పోలీసు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్​పై దాడి జరిగే అవకాశం ఉందన్న విషయాన్ని ఇంటెలిజెన్స్ ఎందుకు పసిగట్టలేకపోయిందని ఏడీజీ ప్రశ్నించారు. ముందుగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలనుకున్న దుద్యాలలో డీఎస్పీ స్థాయి అధికారులతో పాటు 170 మంది పోలీసులు ఉన్నా కలెక్టర్​వెంట ఎందుకు వెళ్లలేదని ఆయన అడిగినట్టు సమాచారం. దీనికి కలెక్టర్​వెంట పోలీసులు కూడా ఉన్నారని ఎస్పీ చెప్పినట్టు తెలిసింది. ఏడీజీ స్పందిస్తూ.. దాడి సమయంలో జిల్లా పోలీస్ అధికారులు ఎవరెవరు? ఎక్కడ డ్యూటీ చేశారో చెప్పాలని అడిగి తెలుసుకున్నారు. 

గత నెలలో లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా కాంగ్రెస్​నేతను బంధించడం, పోలీసులు లాఠీచార్జ్ చేయడం వంటి ఘటనలు జరిగినా పోలీసులు ఎందుకు అలర్ట్​గా లేరని ఆయన ప్రశ్నించినట్టు తెలుస్తున్నది. కలెక్టర్ తో పోలీసులకు సత్సంబంధాలు ఉన్నాయా? లేవా? అని అడిగినట్టు సమాచారం. దాడి కేసులో మరికొంత మందిని విచారించాల్సింది ఉందని జిల్లా యంత్రాంగం అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ తో చెప్పినట్టు తెలుస్తున్నది.