
ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. దుబాయ్ వేదికగా ఆదివారం (మార్చి 9) ఈ బ్లాక్ బస్టర్ ఫైనల్ కోసం దుబాయ్‌లోని పోలీసు అధికారులు అభిమానులను హెచ్చరించారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని మ్యాచ్ కు ముందు సూచించారు. క్రికెటర్లను కలవడానికి స్టేడియంలోకి వస్తే రూ. 3,80,000 నుండి రూ. 2,285,000 (AED 5,000 నుండి AED 30,000) వరకు జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు.
ఆటగాళ్లపై వస్తువులను విసిరితే రూ. 761,000 నుండి రూ. 2.285 మిలియన్ (AED 10,000 నుండి AED 30,000) వరకు జరిమానా విధించబడుతుంది. అంతేకాకుండా జాత్యహంకారం, హింస, రాజకీయ కార్యకలాపాలకు పాల్పడితే కఠినమైన శిక్షలు తప్పవని తెలిపారు. ప్రమాదకరమైన బాణసంచాలు, క్రాకర్స్ లాంటివి ఉపయోగించవద్దని.. అలా చేస్తే కఠినమైన శిక్షలు విధించబడతాయని పోలీసులు అభిమానులను హెచ్చరించారు.
ఆస్ట్రేలియాతో మంగళవారం (మార్చి 4) జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సిక్సర్ తో మ్యాచ్ ను ఫినిష్ చేశాడు. దీంతో ఇండియా ఫైనల్ కు చేరుకుంది. ఇండియా తుది సమరానికి చేరుకున్న ఆనందంలో ఒక అభిమాని గ్రౌండ్ లోకి వేగంగా దూసుకొచ్చి రాహుల్ ను కౌగిలించుకున్నాడు. ఈ సంఘటన తర్వాత దుబాయ్ పోలీసులు ఆటగాళ్లకు భద్రత కల్పించడం కోసం రూల్స్ ను కఠిన తరం చేశారు. పాకిస్థాన్ లోని రావల్పిండి స్టేడియంలోకి దూసుకొచ్చి రచీన్ రవీంద్రను వెనక నుంచి హగ్ చేసుకున్నాడు. అందుకు గాను ఈ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
ALSO READ | IND vs NZ Final: సుందర్‌కు గోల్డెన్ ఛాన్స్.. ఫైనల్‌కు టీమిండియా ప్లేయింగ్ 11లో కీలక మార్పు
ఇక ఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే ఆదివారం (మార్చి 9) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. ఈ రెండు జట్లు ఇదే గ్రూప్ దశలో ఆడిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. భారత్, న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడడం ఇది రెండోసారి. 2000 సంవత్సరంలో కెన్యాలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో ఇండియాపై న్యూజిలాండ్ పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది.
ఆదివారం జరగబోయే ఫైనల్లో భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంటే.. ఐసీసీ టోర్నీల్లో భారత్ పై అద్భుతమైన రికార్డ్ ఉన్న కివీస్ టీమిండియాకు షాక్ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తుంది. ఇరు జట్లు బలంగా కనిపిస్తుండడంతో ఈ మ్యాచ్ హోరా హోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తుంది. ఆదివారం మధ్యాహ్నం 2:30 ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్–18, జియో హాట్‌స్టార్‌లో లైవ్ ప్రసారమవుతుంది.