- ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ముఠాలు
- గతేడాది కుంట్లూరులో తలుపులు బద్దలు కొట్టి చెడ్డీ గ్యాంగ్..
- నెల రోజుల కిందట హయత్ నగర్ లో ధార్ గ్యాంగ్ దోపిడీ
- తాజాగా పెద్ద అంబర్ పేట్ లో పట్టుబడ్డ పార్థి ముఠా సభ్యులు
- కాలనీల్లోని ప్రజలకు సోషల్ మీడియాలో పోలీసులు అలర్ట్
- రాత్రిపూట అనుమానితులు వస్తే సమాచారమివ్వాలని సూచన
గత నెల28న హయత్ నగర్ పరిధి ప్రియదర్శిని కాలనీకి చెందిన ఓ మహిళ తన ఫ్రెండ్ అంత్యక్రియలకు సొంతూరుకు వెళ్లొచ్చే సరికి ఇంట్లో దొంగలు పడ్డారు. 30 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. ’’ దీంతో ఇది లోకల్ దొంగల పనేనా.. లేక దోపిడీ గ్యాంగ్ లు అయ్యి ఉంటారా అని స్థానికులు, పోలీసులు అనుమానాలు వ్యక్తంచేశారు.’
ఎల్బీనగర్,వెలుగు: సిటీ శివారు కాలనీల ప్రజలకు దోపిడీ ముఠా లు వణుకు పుట్టిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుసగా జరిగిన చోరీలు స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత నెలలో హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి పెద్ద అంబర్ పేట్ ప్రజయ్ గుల్మొహర్ గేటెడ్ కమ్యూనిటీలోకి ఓ చోరీ ముఠా కాంపౌండ్ వాల్ సోలార్ ఫెన్సింగ్ ను కట్ చేసి లోపలికి వెళ్లింది. వరుసగా ఐదు ఇండ్లలో చోరీకి యత్నించింది. ఒక ఇంట్లో నగదు, బంగారు, వెండి నగలను ఎత్తుకెళ్లింది.
పోలీసులు సీసీ ఫుటేజ్ లను చెక్ చేయగా ఆశ్చర్యపోయే వాస్తవాలు తెలిశాయి. ప్రమాదకరమైన ధార్ గ్యాంగ్ వచ్చి చోరీ చేసినట్టు గుర్తించారు. ఆ గ్యాంగ్ కు అడ్డొస్తే చంపడానికైనా వెనకాడదని, దీంతో ప్రజలు అలర్ట్ గా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. సోషల్ మీడియాలోనూ ప్రచారం చేశారు. రాత్రిపూట ఎవరైనా తలుపులు కొడితే ఎట్టి పరిస్థితిలో తీయొద్దని సూచించారు. అనుమానం వస్తే 100, స్థానిక పోలీసులకు కాల్ చేయాలని కోరారు. కాగా.. శుక్రవారం అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద నల్లగొండ సీసీఎస్ పోలీసులు, రాచకొండ పోలీసులు కలిసి పార్థిగ్యాంగ్ లోని ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరు అబ్దుల్లాపూర్ మెట్ మండలం కొత్తగూడం చౌరస్తాలో ఆటోఎక్కి సిటీలోకి వస్తుండగా ఆపి తనిఖీ చేసి పట్టుకున్నారు.
ఇంట్లో మనుషులు ఉండగానే..
సిటీ శివారులో గతేడాది చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ చేసింది. కుంట్లూరులో కాలనీలకు దూరంగా ఉండే ఇండ్లను టార్గెట్ చేసి దోపిడీకి పాల్పడింది. ఓ ఇంట్లో మనుషులు ఉండగానే తలుపులను బండరాళ్లతో బద్దలు కొట్టి బెదిరించి దోచుకెళ్లింది. ఆ సమయంలో ఇంట్లోని ఓ యువతి చాకచక్యంగా పోలీసులకు సమాచారం అందించింది. దీంతో పోలీసుల రాకతో పరార్ అయ్యారు. దొంగలను వెంబడించి పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేయగా..వారి వద్ద ఇనుప రాడ్లు ఉండడంతో వెనుదిరిగారు. దీన్ని ప్రిస్టేజ్ గా తీసుకుని ఆ తర్వాత ఓ చోరీ కేసులో ఆ గ్యాంగ్ ను అరెస్ట్ చేసి రాచకొండ పోలీసులు పీడీ యాక్ట్ పెట్టారు. మళ్లీ అదే చెడ్డీ గ్యాంగ్, గత నెలలో ధార్ ముఠా చోరీ చేసిన ప్రజయ్ గుల్మొహర్ గేటెడ్ కమ్యూనిటీలోనే చొరబడింది. ఇలాంటి ఘటనలతో స్థానికుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది.
ధార్ గ్యాంగ్ ఎంట్రీతో అలర్ట్
హయత్ నగర్ ప్రజయ్ గుల్మొహర్ గేటెడ్ కమ్యూనిటీలో జరిగిన ఘటనతో ధార్ గ్యాంగ్ సిటీలోకి ఎంటర్ అయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు సిటీ శివారులో గస్తీ నిఘా పెంచారు. హోటల్స్, ఇతర అనుమానాస్పద ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు వాహనాల తనిఖీలు చేస్తున్నారు.
నిఘా పెట్టాం.. ఆందోళన వద్దు
సిటీ శివారులోకి ధార్ గ్యాంగ్ వచ్చిందనే సమాచారంతో పగలు, రాత్రి గస్తీ పెంచి నిత్యం తనిఖీలు చేస్తున్నాం. ఇప్పటికే నల్లగొండ పోలీసులతో కలిసి పార్ధ గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేశాం. కాలనీల్లో సీసీ కెమెరాలతో కూడా ప్రత్యేక నిఘా ఉంచాం. ప్రజలు ఆందోళన చెందొద్దు.
ప్రవీణ్ కుమార్, డీసీపీ, ఎల్ బీనగర్