- డాక్టర్లపై దాడులు చేస్తే కఠిన చర్యలు: మంత్రి దామోదర
- ప్రివెన్షన్ ఆఫ్ వయెలెన్స్ యాక్ట్ కింద కేసులు
- రాత్రిపూట షీ టీమ్స్‌తో పెట్రోలింగ్
- పోలీస్ స్టేషన్లకు సీసీ కెమెరాల అనుసంధానం
- ప్రతి ఆసుపత్రిలో సేఫ్టీ కమిటీ ఏర్పాటు చేయాలని సూచన
హైదరాబాద్, వెలుగు: డ్యూటీలో ఉన్న డాక్టర్లు, వైద్య సిబ్బందిపై దాడులు చేసే వారిపై ప్రివెన్షన్ ఆఫ్ వయలెన్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని పోలీసు శాఖకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సూచించారు. ప్రస్తుతం పెండింగ్‌లో కేసుల విచారణ కోసం ఉమ్మడి జిల్లాల వారీగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు డాక్టర్లు, సిబ్బంది రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సోమవారం సమావేశం నిర్వహించారు.
అన్ని ప్రభుత్వ దవాఖాన్లలో పోలీస్ అవుట్ పోస్టులు ఏర్పాటు చేయాలని, రాత్రి పూట షీ టీమ్స్‌తో పెట్రోలింగ్ చేయించాలని రవిగుప్తకు మంత్రి సూచించారు. అవుట్ పోస్టుల కోసం దవాఖాన్లలో స్థలం కేటాయించాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్త, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అడిషనల్ డీజీ అనిల్ కుమార్, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కర్ణన్, లా సెక్రటరీ రెండ్ల తిరుపతి, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వాణి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ఎంఎన్‌జే హాస్పిటల్ డైరెక్టర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
సీసీ కెమెరాల అనుసంధానం
రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి గాంధీ, ఉస్మానియా వంటి టీచింగ్ హాస్పిటల్ వరకు అన్నింటిలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వాటిని స్థానిక పోలీస్ స్టేషన్లకు అనుసంధానించాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ దవాఖాన్ల సెక్యూరిటీ కాంట్రాక్ట్ దక్కించుకున్న ఏజెన్సీలు తప్పనిసరిగా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ రెగ్యులేషన్స్ యాక్ట్ ప్రకారం గుర్తింపు పొంది ఉండాలని, సెక్యూరిటీ గార్డులు ట్రైనింగ్ తీసుకుని ఉండాలన్నారు.
సెక్యూరిటీ గార్డుల వివరాలన్నీ స్థానిక పోలీసులకు ఇవ్వాలన్నారు. వారి పూర్వపరాలను పోలీసులు విచారించాలని సూచించారు. ప్రభుత్వ దవాఖాన్లు, మెడికల్ కాలేజీల్లో మహిళా డాక్టర్లు, సిబ్బంది రక్షణ కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్‌లైన్స్ అమలు చేయాలన్నారు. సుప్రీం ఆదేశాల ప్రకారం ప్రతి హాస్పిటల్‌లో సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేసి, ఈ నెల 14వ తేదీలోపు తనకు నివేదిక ఇవ్వాలన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలలో హాస్పిటల్స్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేసి, భద్రతాపరమైన నియమాలను రూపొందించాలన్నారు. స్టాండర్డ్ ప్రొటోకాల్ తయారు చేయాలని, అదే ప్రొటోకాల్‌ను అన్ని హాస్పిటళ్లు అమలు చేయాలన్నారు. డాక్టర్లు, సిబ్బందిపై దాడి చేసిన వారిపై ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలను ఇవ్వాలని, వాటి పరిష్కారం కోసం ఉమ్మడి జిల్లాల వారీగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని హోంశాఖ సెక్రటరిని ఆదేశించారు.
కేటీఆర్.. లెక్కలు తెలుసుకొని మాట్లాడు
రాజకీయాల కోసం అసత్య ప్రచారాలు మానుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. డెంగీ కేసుల విషయంలో కేటీఆర్ చేసిన ట్వీట్‌కు మంత్రి కౌంటర్ ఇచ్చారు. డెంగీ కట్టడిలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని అంతకుముందు కేటీఆర్ ట్వీట్ చేశారు. 6 వేలకు పైగా డెంగీ కేసులు నమోదయ్యాయని, ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. దీనిపై మంత్రి దామోదర స్పందించారు. బీఆర్‌ఎస్ హయాంలో నమోదైన డెంగీ కేసుల కంటే, ఈ ఏడాది తక్కువగా నమోదయ్యాయని తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అన్ని వివరాలు తెలుసుకుని.. ఆ తర్వాత ట్వీట్లు చేయాలని హితవు పలికారు.
బాధితుల వద్దకే వెళ్లి వైద్యం చేయండి
రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆరోగ్యశాఖ అధికారులను మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశించారు. ఫీవర్ సర్వే పకడ్బందీగా చేయాలని, బాధితుల వద్దకే వెళ్లి వైద్య సేవలు అందించాలని చెప్పారు. అవసరమైన వారందరికీ టెస్టులు చేసి, మందులు అందజేయాలని సూచించారు. వరదల తీవ్రత ఎక్కువగా ఉన్న ఖమ్మం జిల్లాలో పది మెడికల్ టీమ్‌లను ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రతి టీమ్‌లో స్పెషలిస్ట్ డాక్టర్లు, సిబ్బంది, టెస్టులు చేయడానికి అవసరమైన పరికరాలు, మందులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.