మన్నెగూడ యువతి కిడ్నాప్ కేసులో రంగారెడ్డి కోర్టు అనుమతితో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని మూడు రోజుల కస్టడీ కోసం ఆదిభట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడిని కస్టడీలోకి తీసుకునే సమయంలో పోలీసులు స్టేషన్ వద్ద అత్యుత్సాహం ప్రదర్శించారు. మీడియాను, ఇతరులను ఎవరినీ లోపలికి రానివ్వకుండా పోలీస్ స్టేషన్ మెయిన్ గేట్ ను సీఐ మూయించారు. మీడియా ప్రతినిధులు గేట్ బయటే ఉండాలంటూ హుకుం జారీ చేశారు.
అంతకుముందు యువతి కిడ్నాప్ కేసులో A1 నిందితుడు నవీన్ రెడ్డిని విచారించేందుకు 8 రోజులు పోలీస్ కస్టడీ కి కావాలంటూ ఆదిభట్ల పోలీసులు ఇబ్రహీంపట్నం కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఇబ్రహీంపట్నం కోర్టు ఒకే రోజు కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో పోలీసులు జిల్లా కోర్టును ఆశ్రయించగా 3 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో ఈ రోజు ఆదిభట్ల పోలీసులు చర్లపల్లి జైలు నుంచి నిందితుడు నవీన్ రెడ్డిని కస్టడీకి తీసుకొని, ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం ఆదిభట్ల పోలీస్ స్టేషన్ కి తరలించారు.