రంగారెడ్డి: అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్, జనసేన నేత జానీని కస్టడీ కోరుతూ నార్సింగ్ పోలీసులు రంగారెడ్డి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్నీ వివరాలు రాబట్టేందుకు జానీని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. కాగా, జానీ కస్టడీ పిటిషన్‌పై రంగారెడ్డి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే దానిపై ఉత్కంఠ నెలకొంది.
అసలేం జరిగిందంటే..
కొరియోగ్రాఫర్ జానీ తనను లైంగికంగా వేధించడంతో పాటు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాని ఓ మహిళా కొరియోగ్రాఫర్ జానీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీపై పోక్సో యాక్ట్‌తో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. జానీ మాస్టర్‌కు ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం జానీ చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
ఈ క్రమంలో కేసుకు సంబంధించిన మరిన్నీ వివరాలు రాబట్టేందుకు జానీని విచారించాల్సి ఉందని.. అతడిని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని నార్సింగ్ పోలీసులు రంగారెడ్డి కోర్టును ఆశ్రయించారు. వారం రోజుల పాటు తమకు అప్పగించాలని కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల అభ్యర్థను మేరకు న్యాయస్థానం జానీని కస్టడీకి అప్పగిస్తుందా..? లేదా..? ఒకవేళ జానీ కస్టడీకి అప్పగిస్తే ఎలాంటి విషయాలు బయటకు వస్తాయనే దానిపై సినీ సర్కిల్స్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.