హైదరాబాద్: నటుడు అల్లు అర్జున్ ఇంటిపై దాడి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ నివాసం దగ్గర భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా బన్నీ నివాసం వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. 2024, డిసెంబర్ 23న అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటనను దృష్టిలో పెట్టుకుని పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
అల్లు అర్జున్ నివాసం పరిసరాల్లో అనుమానితులు కనబడితే పోలీసులు ప్రశ్నిస్తున్నారు. డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఓయూ జేఏసీ నాయకులు ఆదివారం (డిసెంబర్ 22) అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించిన విషయం తెలిసిందే. బాధిత ఫ్యామిలీకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బన్నీ ఇంటి ముందు బైఠాయించారు.
రేవతి ఫ్యామిలీకి రూ. కోటి నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళన సమయంలో కొందరు బన్నీ ఇంటి కంపౌండ్ వాల్ ఎక్కి రాళ్లు, టమాటాలు రువ్వగా.. మరి కొందరు ఇంట్లోకి వెళ్లి పూల కుండీలను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యల్లో భాగంగా సోమవారం బన్నీ ఇంటి దగ్గర పోలీసులు భద్రతను పెంచారు.