కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలం చింతకుంట వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద పోలీసులను కాపలా పెట్టారు. రెండు రోజుల క్రితం స్థానిక మహిళలు ఇక్కడి డబుల్ బెడ్ రూం ఇండ్లను ఆక్రమించుకునేందుకు ప్రయత్నించగా.. ఈ రోజు మళ్లీ వస్తారన్న అనుమానంతో కొత్తపల్లి పోలీసులు అక్కడ కాపాలా కాస్తున్నారు. గత ఆదివారం కరీంనగర్ నగరానికి చెందిన దాదాపు 40 మంది మహిళలు డబుల్ బెడ్ రూంలను ఆక్రమించుకుని ఫ్లాట్లలో పేర్లు రాసుకుని వెళ్లారు. వారిని చూసి సోమవారం కూడా ఓ పది మహిళలు రాగా పోలీసులు వారిని అడ్డుకుని పంపించారు.
మంగళవారం కూడా మరికొంత మంది మహిళలు వస్తారన్న అనుమానంతో కొత్తపల్లి ఎస్ఐ ఎల్లయ్యగౌడ్ తో పాటు, మరికొంత మంది పోలీసులు అక్కడే మకాం వేసారు. అయితే డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేటాయించిన తర్వాతే తీసుకోవాలని.. అంతేతప్ప ఆక్రమించుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే అక్రమించుకునేందుకు ప్రయత్నించిన వారిపై కేసులు పెట్టామని ఎస్ఐ చెప్పారు. బద్దిపల్లి గ్రామంలోని ఖాళీ స్థలాలను కూడా కొందరు చీరలు పరిచి ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తే వారిపై కూడా కేసులు పెట్టామని అన్నారు. కొందరు నాయకులు రెచ్చగొట్టే మాటలు చెబితే అవి నమ్మి ఇక్కడికి రావద్దని సూచించారు.