
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వర్శిటీ దగ్గర్లోని 400 ఎకరాల భూమిని అమ్మొద్దని ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిరసన వ్యక్తం చేస్తోన్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేసినట్లు ఆరోపణలు వినిపించాయి. దీంతో వర్శిటీ విద్యార్థులపై లాఠీ చార్జ్ ఘటనపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం (మార్చి 31) ఒక ప్రకటన విడుదల చేశారు. HCUలో విద్యార్థులపై లాఠీ చార్జ్ జరగలేదని వివరణ ఇచ్చారు.
ALSO READ | ఒక్క ఇంచ్ కూడా HCU భూమి లేదు.. ఆ 400 ఎకరాలూ ప్రభుత్వానిదే: టీజీఐఐసీ క్లారిటీ
కొందరు బయటి వ్యక్తులు విద్యార్థులను కావాలని రెచ్చగొడుతున్నారని తెలిపారు. ఆదివారం (మార్చి 30) మధ్యాహ్నం 3:30కు కంచె గచ్చిబౌలిలో పనులు జరుగుతుండగా బయటి వ్యక్తులు దాడులకు దిగారు. ప్రభుత్వ అధికారులపై రాళ్ళు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్ గాయపడ్డారని తెలిపారు. ఈ క్రమంలో క్యాంపస్ వద్ద పరిస్థితి అదుపు తప్పుతుండటంతో 53 మందిని అదుపులోకి తీసుకుని పర్సనల్ బాండ్ మీద వదిలేశామని వెల్లడించారు.
రోహిత్, నవీన్ కుమార్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని.. వీళ్లిద్దరికీ క్యాంపస్‌తో ఎలాంటి సంబంధం లేకపోయినా అక్కడ ఉండి అల్లర్లు సృష్టించారని పేర్కొన్నారు. విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసినట్లు పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేయటం తగదని అన్నారు. విద్యార్థులను హాస్టళ్లకు వెళ్లి అరెస్ట్ చేశారు అనేది అవాస్తవమని తెలిపారు. యూనివర్సిటీ విద్యార్థులు బయటి వ్యక్తుల ట్రాప్‌లో పడొద్దని.. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.