మీ ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్ ఎవరికి లీజుకిచ్చారు? అక్కడ కోడిపందేలు, క్యాసినో జరుగుతున్నట్టు తెలియదా?

మీ ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్  ఎవరికి లీజుకిచ్చారు? అక్కడ కోడిపందేలు, క్యాసినో జరుగుతున్నట్టు తెలియదా?
  • బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లిని ప్రశ్నించిన పోలీసులు 
  • నాలుగున్నర గంటల పాటు సాగిన విచారణ 

చేవెళ్ల, వెలుగు: ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లో కోడిపందేలు, క్యాసినో నిర్వహించిన వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు విచారించారు. శుక్రవారం ఉదయం 11:30 గంటలకు మొయినాబాద్​పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌కు చేరుకున్న పోచంపల్లిని సీఐ పవన్ కుమార్​రెడ్డి ప్రశ్నించారు. ‘‘మీ ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లో క్యాసినో,  కోడి పందేలు  జరుగుతున్నాయన్న విషయం మీకు తెలియదా?  మీ ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌ను ఎవరికి లీజుకు ఇచ్చారు?” అని ప్రశ్నల వర్షం కురిపించారు. దీనికి పోచంపల్లి సమాధానమిస్తూ.. ‘‘నా అల్లుడికి ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్ లీజుకు​ఇచ్చాను. అతడు మరో వ్యక్తికి లీజుకు ఇచ్చాడు. అయితే ఆ విషయం నాకు చెప్పలేదు. అందులో కోడిపందేలు, క్యాసినో జరుగుతున్న విషయం కూడా నాకు తెలియదు. నాకు తెలియకుండా అలా చేస్తున్నందుకు వారిపై మొయినాబాద్​పీఎస్‌‌‌‌‌‌‌‌లోనే నేను కేసు పెట్టాను” అని చెప్పారు. మరి ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్ లీజ్ పేపర్లు ఏవని అడగ్గా.. ‘‘ఫిబ్రవరి 13న నాకు మొదటిసారి నోటీసులు ఇచ్చినప్పుడు వివరణ ఇస్తూ లీజు పత్రాలు సమర్పించాను. ప్రస్తుతం పేపర్లు తీసుకురాలేదు” అని తెలిపారు.

 కేసు దర్యాప్తులో భాగంగా ఎప్పుడు పిలిచినా విచారణకు హజరు కావాలని పోలీసులు ఆదేశించగా, సరేనని చెప్పారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు కొనసాగిన విచారణ.. సాయంత్రం 4 గంటలకు ముగిసింది. అనంతరం స్టేషన్ బయట మీడియాతో పోచంపల్లి మాట్లాడుతూ.. రాజకీయ కక్షతోనే తనపై కేసు నమోదు చేశారని ఆరోపించారు. కాగా, విచారణకు హాజరుకావాలని మొదట ఫిబ్రవరి 13న పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే అదే నెల 16న ఆయన తరఫు లాయర్ హాజరై వివరణ ఇచ్చారు. మొత్తం 11 ఎకరాల విస్తీర్ణంలో ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్ ఉందని, దాన్ని 2023లో వర్ర రమేశ్ కుమార్ రెడ్డికి లీజుకు ఇచ్చారని, ఆయన నుంచి మరో వ్యక్తికి లీజు మారిందని లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చారు. దీనిపై సంతృప్తి చెందని పోలీసులు గురువారం మరోసారి పోచంపల్లికి నోటీసులు ఇవ్వగా, ఆయన శుక్రవారం విచారణకు హాజరయ్యారు.