నోట్ల కట్టల జడ్జి నివాసంలో పోలీసుల తనిఖీలు

నోట్ల కట్టల జడ్జి నివాసంలో పోలీసుల తనిఖీలు

న్యూఢిల్లీ: నోట్ల కట్టలు దొరికిన ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. డీసీపీ నేతృత్వంలోని పోలీసుల టీమ్ బుధవారం మధ్యాహ్నం 1:50 గంటలకు ఆయన ఇంటికి చేరుకుంది. దాదాపు రెండు గంటల పాటు తనిఖీలు చేసింది. ఆ తర్వాత తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్‌‌కు చేరుకుంది. మీడియాతో మాట్లాడేందుకు పోలీసులు నిరాకరించారు. కేసు విచారణలో భాగంగా జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటిని పోలీసులు పరిశీలించారు. 

ఆయన ఇంట్లోని స్టాఫ్‌‌ను ప్రశ్నించినట్టు తెలిసింది. కాగా, ఈ వ్యవహారంపై విచారించేందుకు సుప్రీంకోర్టు త్రీమెన్ కమిటీ వేసింది. ఇందులో పంజాబ్, హర్యానా హైకోర్టు చీఫ్ జస్టిస్ శీల్ నాగు, హిమాచల్‌‌ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ జీఎస్ సంధావాలియా, కర్నాటక హైకోర్టు జడ్జి జస్టిస్ అను శివరామన్ ఉన్నారు. వీళ్లు ముగ్గురూ మంగళవారం జస్టిస్ వర్మ అధికారిక నివాసాన్ని పరిశీలించారు.