ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కేసులే

  • నిబంధనలు ఉల్లంఘించిన అభ్యర్థులు, కార్యకర్తలపై పోలీసుల కొరడా
  • మూడు రోజుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులపై 16 కేసులు
  • పార్టీల గుర్తులు ఉపయోగించిన ఆటోడ్రైవర్లపైనా చర్యలు

కరీంనగర్, వెలుగు : ఎన్నికల కోడ్  అతిక్రమించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. పర్మిషన్ లేకుండా సభలు నిర్వహించడం, సమయం దాటినా ప్రచారం చేయడం, ఓటర్లకు లిక్కర్ సప్లై చేయడం, పటాకులు కాల్చడం, ఎన్నికల ప్రచార వాహనంలో అనుమతులు లేకుండా డీజేలు వినియోగించడం, జెండాలను కరెంట్  స్తంభాలకు కట్టడం లాంటి చర్యలకు పాల్పడినందుకు పోలీసులు కేసులు పెడుతున్నారు. మంగళ, బుధ, గురువారాల్లో కరీంనగర్  కమిషనరేట్  వ్యాప్తంగా వివిధ పోలీస్  స్టేషన్లలో  కోడ్  ఉల్లంఘించిన ఘటనలపై 16  కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు నమోదైన వారిలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందినవారు ఉన్నారు. 

కరీంనగర్ జిల్లాలో కేసులు నమోదైన వారి వివరాలు..

కేశవపట్నం మండలం ఎరడపల్లి గ్రామానికి చెందిన మాతంగి హరికృష్ణ , కలకుంట్ల రంజిత్  రావు , పోతునూరి హరీశ్,  వి.సాయికృష్ణ మంగళవారం సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి పర్మిషన్​ తీసుకోకుండా బీఆర్ఎస్  ఎమ్మెల్యే అభ్యర్థి రసమయి కోసం డీజే వినియోగించారు. దీంతో పోలీసులు డీజే ను సీజ్ చేసి, వారిపై కేసు నమోదు చేశారు. 

 చొప్పదండి పోలీస్ స్టేషన్  పరిధిలో మహేశుని మల్లేశం, కొత్తూరి నరేశ్, కొత్తూరి మహేశ్, యెన్నం మనోహర్, శ్రీకాంత్  అనుమతి లేకుండా ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్ కు అనుకూలంగా చొప్పదండి లోని ఓ ఫంక్షన్ హాల్ లో 100 మందిని సమీకరించి వారికి భోజనం, లిక్కర్  సరఫరా చేశారు. దీంతో వారిపై  కేసు నమోదైంది.

 కరీంనగర్ లోని గీతాభవన్  చౌరస్తా వద్ద మంగళవారం నిర్వహించిన వెహికిల్  చెకింగ్ లో హరీశ్  అనే వ్యక్తి తన వెహికల్ లో బీజేపీ నాయకుల ఫొటోలతో కూడిన 500 కరపత్రాలు, 10 బీజేపీ కండువాలను  రవాణా చేస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. 

  హుజూరాబాద్  పోలీస్  స్టేషన్  పరిధిలో మంగళవారం మాజీ సీఎం చంద్రబాబు విడుదలైన సందర్భంగా టీడీపీకి చెందిన ఐత హరీశ్  ఆధ్వర్యంలో రామగిరి అంకుస్, ఆడెపు రవీందర్, లింగారావు , ఎస్ కే ఫయాజ్  అంబేద్కర్  చౌరస్తా వద్ద పటాకులు కాల్చడంతో కేసు నమోదు చేశారు.

 కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కమాన్ చౌరస్తా వద్ద పోలీసులు బుధవారం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా శంకరపట్నం మండలం గద్దపాక గ్రామానికి చెందిన నందికొండ మహేందర్  రెడ్డి తన కారుకు ఎలాంటి అనుమతులు లేకుండా ఎమ్మెల్యే అభ్యర్థి రసమయి బాలకిషన్  పోస్టర్ ను ప్రజలకు కనిపించేలా ప్రదర్శిస్తున్నందున కేసు నమోదైంది. 

 తిమ్మాపూర్  మండలం మొగిలిపాలెం గ్రామానికి చెందిన వరికోళ్ల చంద్రయ్య తన ఆటోలో రసమయి బాలకిషన్ పోస్టర్ ను  ముందు, పక్క భాగంలో ప్రజలకు కనిపించేలా ప్రదర్శిస్తున్నందున కరీంనగర్  సిటీలోని కమాన్  చౌరస్తా వద్ద అతడిని పట్టుకుని కేసు నమోదు చేశారు. 

 గంగాధరకు చెందిన పులి మారుతి, చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేడిపల్లి సత్యం బుధవారం అనుమతి లేకుండా వంద మంది కార్యకర్తలతో సమావేశం నిర్వహించడంతోపాటు రామడుగు లో డీజే వినియోగించినందుకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

 గంగాధరకు చెందిన లోక రాజేశ్వర్, రామిడి సురేందర్, సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ తాడిచెరువు గ్రామ శాఖ ప్రెసిడెంట్లపై ఎంసీసీ ఉల్లంఘనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  

 చొప్పదండి అభ్యర్థి సుంకె రవిశంకర్ ప్రచార అనుమతి పరిమితులను అతిక్రమించి, సమయం దాటిన తర్వాత కార్నర్  మీటింగ్ నిర్వహించడంతో కేసు నమోదు పెట్టారు. 

 సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండపల్లి గ్రామానికి చెందిన జగ్గాని శివ, చొప్పదండి శ్రీనివాస్  తమ కారులో ఎలాంటి  అనుమతులు లేకుండా సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్  పార్టీ ఇంచార్జ్  కేకే మహేందర్ కి చెందిన 180 కరపత్రాలు, 50 బుక్ లెట్లను తీసుకెళ్తుండగా కేసు నమోదు చేశారు. 

 జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని జగ్గయ్యపల్లెలో బుధవారం హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి  కౌశిక్ రెడ్డి ఎలక్షన్  వెహికిల్ లో డీజే వినియోగించడంతో అబ్దుల్ కరీమ్, బడే జేమ్స్ , వడ్డేపల్లి సతీష్, వడ్డెపల్లి పోచయ్య పై కేసు నమోదు చేసి , డీజే, వెహికిల్ ను సీజ్ చేశారు.

 తిమ్మాపూర్ మండలం అలుగునూర్ గ్రామానికి చెందిన జమీల్  ఖాన్  ఎలాంటి అనుమతి లేకుండా బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ ప్రచార పోస్టర్ ను తన ఆటో వెనుక ప్రజలకు కనిపించేలా అతికించినందుకు కరీంనగర్  వన్ టౌన్  పరిధిలో ఆ వాహనాన్ని సీజ్ చేసి, జమీల్ ఖాన్ పై కేసు నమోదు చేశారు. 

 కరీంనగర్ కశ్మీర్ గడ్డ లో గురువారం బీఆర్ఎస్  యూత్  ప్రెసిడెంట్  మహమ్మద్ మహబూబ్  ఖాన్, మైనారిటీ యూత్  ఆత్మీయ సమావేశం కోసం మాత్రమే అనుమతి తీసుకున్నప్పటికీ, 500 మందికి చికెన్  బిర్యానీతో విందు ఏర్పాటు చేయడంతో కేసు నమోదైంది.

 చొప్పదండి టౌన్  బీఆర్ఎస్  ప్రెసిడెంట్  లోక రాజేశ్వర్  రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్  ఎన్నికల ప్రచారం కోసం రిటర్నింగ్ అధికారి వద్ద చొప్పదండిలోని 1, 2, 3వ వార్డుల్లో 50 మందితో కూడిన స్ట్రీట్‌‌‌‌ మీటింగ్స్ కు పర్మిషన్ తీసుకొని 300 మందితో సమావేశం నిర్వహించారు. దీంతోపాటు డ్రోన్ తో వీడియో తీసినందుకు ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్, లోక రాజేశ్వర్ రెడ్డి, రాజుపై కేసు నమోదు చేశారు. 

 గంగాధర మండలం గర్శకుర్తిలో ఇంటింటి ప్రచారానికి రిటర్నింగ్  అధికారి నుంచి పర్మిషన్ తీసుకుని పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయడంతో చొప్పదండి కాంగ్రెస్  అభ్యర్థి మేడిపల్లి సత్యం, ఆయన పీఏ పులి మారుతి, కాంగ్రెస్  నాయకుడు చిప్ప చక్రపాణిపై కేసు పెట్టారు. 
 

వీణవంక మండలం కనపర్తి, వల్బాపూర్ లో బీఆర్ఎస్  జెండాలను విద్యుత్  స్తంభాలకు కట్టడంతో ఆయా గ్రామాల సర్పంచ్ లు పర్లపల్లి రమేశ్, ఎక్కటి రఘుపాల్ రెడ్డితోపాటు పూర్ణ చందర్ పై కేసు నమోదు చేశారు. 

వీణవంకలో ముందస్తు అనుమతి లేకుండా కాంగ్రెస్  ఎమ్మెల్యే అభ్యర్థి ఒడితల ప్రణవ్, వీణవంక మండల కాంగ్రెస్  పార్టీ ప్రెసిడెంట్  శ్యాంసుందర్  రెడ్డి స్థానిక లక్ష్మీగణపతి ఫంక్షన్ హాల్ లో 300 మందితో సమావేశం ఏర్పాటు చేయడంతోపాటు వారిద్దరిపై కేసు నమోదు చేశారు.