- రాజకీయ శరణార్థి దరఖాస్తుపై సమాచారం లేదు
- ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుపై ఇప్పటికే ఎల్‌ఓసీ జారీ
- పాస్‌పోర్టులు జప్తు.. సెప్టెంబర్‌తో ముగిసిన వీసా గడువు
- రెడ్‌కార్నర్, ఎక్స్ ట్రాడిషన్ ద్వారా రప్పిస్తామని వెల్లడి
- శ్రవణ్‌రావు, రాధాకిషన్‌రావు బెయిల్‌పై తీర్పు రిజర్వ్
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు, 6వ నిందితుడు ఐ న్యూస్ మాజీ ఎండీ శ్రవణ్‌రావు అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నారని హైకోర్టుకు పోలీసులు తెలిపారు. ప్రభాకర్‌రావు అమెరికాలో గ్రీన్‌కార్డ్ పొందినట్టు గతంలో ప్రచారం జరిగిందని, కానీ ఆయనకు ఎలాంటి గ్రీన్ కార్డు మంజూరు కాలేదన్నారు. అలాగే తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్ రావు దరఖాస్తు చేసుకున్నారంటూ ప్రచారం జరిగిందని, దీనిపై మాత్రం తమ వద్ద ఎలాంటి సమాచారం లేదన్నారు.
అయితే, వీరిద్దరి వీసాల గడువు సెప్టెంబర్ లోనే ముగిసిందని, వీరు మూడు నెలలుగా అమెరికాలో అక్రమంగా ఉంటున్నారని తమ దర్యాప్తులో గుర్తించామని ఈ మేరకు పోలీసులు గత సోమవారం హైకోర్టుకు నివేదిక సమర్పించారు. వీరిని రెడ్‌కార్నర్ నోటీసులు, నేరస్తుల అప్పగింత ఒప్పందం ద్వారా భారత్ కు తీసుకొచ్చేందుకు సీబీఐ, విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని కోర్టుకు పోలీసులు వివరించినట్లు తెలిసింది.
కాగా, గతేడాది డిసెంబర్ 4న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్‌ఐబీ) లాగర్ రూమ్ ధ్వంసం తరువాత ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు అమెరికాకు పారిపోయారు. ఈ కేసులో బెయిల్ కోసం శ్రవణ్‌రావు హైకోర్టును ఆశ్రయించాడు. బెయిల్ పిటిషన్‌పై ఈ నెల11న వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. కౌంటర్ రిపోర్ట్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో ఈ నెల16న పోలీసులు రిపోర్ట్ దాఖలు చేశారు. శ్రవణ్‌రావు, ప్రభాకర్‌రావును అరెస్ట్ చేసి విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఎల్‌ఓసీ జారీ, పాస్‌పోర్ట్ జప్తు, ముగిసిన వీసా
ప్రభాకర్‌రావుతో పాటు శ్రవణ్‌రావుపై ఇప్పటికే లుక్ అవుట్ సర్క్యులర్(ఎల్ఓసీ)లు జారీ అయ్యాయి. ఇద్దరి పాస్ పోర్టులు కూడా జప్తు చేశారు. వీరిద్దరి వీసా గడువు కూడా సెప్టెంబర్ లో ముగిసింది. వీసా గడువు ముగిసినప్పటికీ వీరు తిరిగి రాకుండా అమెరికాలోనే స్థావరాలు మార్చుతూ తిరుగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీసా గడువు ముగిసినప్పటికీ అమెరికాలో అక్రమంగా నివసించే వారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. ఇలా వీరిద్దరు కూడా ఓవర్ స్టేయర్స్ గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు అమెరికాలో ఉంటున్న అడ్రస్‌లతో పాటు ప్రభాకర్‌రావు ట్రీట్‌మెంట్ పొందుతున్న హాస్పిటల్ వివరాలను యూఎస్ పోలీసులకు అందించేందుకు రాష్ట్ర పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే రెడ్ కార్నర్ నోటీసుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు సీబీఐ, ఇంటర్‌పోల్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు.
రాధాకిషన్ రావుకు ఎస్కార్ట్ బెయిల్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న సిటీ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు ఎస్కార్ట్ బెయిల్ లభించింది. మామ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అనుమతి కోరుతూ రాధాకిషన్ రావు పిటిషన్ దాఖలు చేయగా, ఆయన విడుదలకు అనుమతిస్తూ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం ఉదయం10 గంటల నుంచి ఈ నెల 28 సాయంత్రం 5 గంటల వరకు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో బుధవారం ఉదయం ఆయన జైలు నుంచి బయటకు వచ్చాడు.