చిన్నమ్మ కూతురికి మగ పిల్లలు లేకపోవడంతో ఆమె బాధ చూడలేక..

చిన్నమ్మ కూతురికి మగ పిల్లలు లేకపోవడంతో ఆమె బాధ చూడలేక..

నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్‌‌లో ఈ నెల 4న కిడ్నాప్‌‌ అయిన బాలుడిని పోలీసులు రక్షించారు. నిందితుడు తన చిన్నమ్మ కూతురికి మగ పిల్లలు లేకపోవడంతో ఆమె బాధ చూడలేక బాలుడిని కిడ్నాప్‌‌ చేసినట్లు గుర్తించి, అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నార్కట్‌‌పల్లి మండలం మాండ్ర గ్రామానికి చెందిన రాపోలు సీతారాములు చిన్నమ్మ కూతురు, నకిరేకల్‌‌లో ఉంటున్న ముద్దముల అరుణకు ముగ్గురు కుమార్తెలు. మగ పిల్లలు లేకపోవడంతో ఆమె బాధను చూడలేకపోయిన సీతారాములు బాలుడిని కిడ్నాప్‌‌ చేసి తన చెల్లెలుకు ఇవ్వాలని నిర్ణయించాడు. 

ఇందులో భాగంగా సీతారాములు వారం కింద నల్గొండలోని హాస్పిటల్‌‌కు వెళ్లి అక్కడ ఎలాంటి ఆధారం లేకుండా గడుపుతున్న హైమద్‌‌ కుటుంబాన్ని చూశాడు. వారితో క్రమంగా పరిచయం పెంచుకున్నాడు. ఈ నెల 4న హైమద్‌‌ కుమారుడు మూడేండ్ల అబ్దుల్‌‌ రహమాన్‌‌ను కిడ్నాప్‌‌ చేసి నకిరేకల్‌‌కు వెళ్లి తన చెల్లెలుకు ఇచ్చాడు. రహమాన్‌‌ కనిపించకపోవడంతో హైమద్ దంపతులు గురువారం నల్గొండ టూ టౌన్‌‌ పోలీస్‌‌స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు. దీంతో బాలుడి ఆచూకీ కనుగొనేందుకు ఎస్పీ శరత్‌‌ చంద్ర పవార్‌‌ మూడు ప్రత్యేక టీమ్స్‌‌ను ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు సీతారాములు సెల్‌‌ఫోన్‌‌ సిగ్నల్స్‌‌ ఆధారంగా అతడు నకిరేకల్‌‌లో ఉన్నట్లు గుర్తించారు. శుక్రవారం నకిరేకల్‌‌ వెళ్లి అతడిని అరెస్ట్‌‌ చేసి, బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.