హైదరాబాద్ : కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. కోవిడ్ రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మాస్క్ లు లేకుండా కనిపిస్తే జరిమానాలు విధిస్తామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించారు.
నూతన సంవత్సర వేడుకల్లో డీజేకి అనుమతి లేదని.. పబ్ లు, రెస్టారెంట్లపై స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. పరిమితికి మించి ఈవెంట్ పాసులు విక్రయించవద్దని, ఈ కార్యక్రమాలకు డబుల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారికే అనుమతిస్తామని తేల్చి చెప్పారు. పార్టీల్లో డ్రగ్స్ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని సీవీ ఆనంద్ వార్నింగ్ ఇచ్చారు. రాత్రి 11గంటల నుంచి ఉదయం. 5 వరకు నగరంలోని ఫ్లై ఓవర్లను మూసివేయనున్నట్లు కమిషనర్ ప్రకటించారు. డిసెంబర్ 31 రాత్రి ఆకస్మికంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని, మద్యం మత్తులో రోడ్లపై హంగామా చేసే వారికి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.