భక్తురాలు అప్సర.. పూజారి వెంకట సాయి సూర్య కృష్ణ కేసులో వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ముందుగా ప్లాన్ చేసుకుని.. అప్సరను చంపినట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు వెల్లడించారు. సరూర్ నగర్ లోని బంగారు మైసమ్మ ఆలయంలో సాయి సూర్య కృష్ణ పూజారిగా చేస్తుండగా.. ఆ గుడికి అప్సర తరచూ వస్తూ ఉండేది. ఆ పరిచయమే ప్రేమ, వివాహేతర సంబంధానికి దారి తీసిందని చెబుతున్నారు పోలీసులు. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని వెల్లడించారు.
2023, జూన్ 4వ తేదీన గోశాలకు వెళుతున్నామని అప్సరను.. శంషాబాద్ తీసుకెళ్లినట్లు వివరించారు పోలీసులు. అప్పటికే ఒక సారి అబార్షన్ చేయించిన సాయికృష్ణ తీరుపై అప్సర ఆగ్రహం వ్యక్తం చేయటం.. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తుండటంతో.. నర్కుడ దగ్గర కారు ఆపి.. ఆమెను చంపేశాడు. తలపై బండరాయితో కొట్టటంతోపాటు.. మత్తు ఇంజెక్షన్స్ ఇచ్చినట్లు చెబుతున్నారు పోలీసులు. అప్సర చనిపోయినట్లు నిర్థారించుకున్న తర్వాత.. ఆ డెడ్ బాడీని కారులో వేసుకుని.. సరూర్ నగర్ తీసుకొచ్చినట్లు చెబుతున్నారు పోలీసులు. తహశీల్దార్ ఆఫీస్ వెనక భాగంలోని సెప్టిక్ ట్యాంక్ లో అప్సర డెడ్ బాడీ వేసి.. దానిపై ఎర్ర మట్టి పోశాడు. ఆ తర్వాత ఆ సెప్టిక్ ట్యాంక్ మొత్తాన్ని సిమెంట్ తో చదును చేయించినట్లు వెల్లడించారు పోలీసులు.
అప్సర – సాయికృష్ణ ప్రేమ వ్యవహారం ఇద్దరి ఇళ్లల్లో తెలియదని చెబుతున్నారు పోలీసులు. గతంలోనే ఓ సారి అప్సర గర్భవతి అయ్యిందని.. సాయి కృష్ణే అబార్షన్ చేయించినట్లు స్పష్టం చేశారు పోలీసులు. వీళ్లిద్దరి వ్యవహారం ఇళ్లల్లో తెలియకుండా జాగ్రత్త పడ్డారని తెలిపారు. హత్య జరిగిన రోజు అప్సర – సాయికృష్ణ సెల్ ఫోన్ లొకేషన్స్ మ్యాచ్ అయ్యాయని.. ఒకే చోట ఉన్నారని వెల్లడించారు పోలీసులు. హత్య చేసిన తర్వాత.. సాయి కృష్ణనే స్వయంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి.. మా మేనకోడలు కనిపించటం లేదని కంప్లయింట్ ఇచ్చాడని తెలిపారు పోలీసులు.
ఈ మొత్తం వ్యవహారంలో.. అటు అప్సర పేరంట్స్.. ఇటు సాయికృష్ణ పేరంట్స్ తోపాటు పోలీసులు చెబుతున్న వివరాలు చూస్తుంటే.. వీళ్లిద్దరి మధ్య బంధాన్ని రహస్యంగా ఉంచిన సాయికృష్ణ.. హత్య తర్వాత కూడా తప్పించుకునేందుకు.. ముందస్తుగా పక్కా ప్లాన్ వేసుకున్నట్లు తెలుస్తుంది. కానీ శవం నిజం కదా.. ఎప్పటికైనా బయటపడి తీరాల్సిందే..