- ఆదిబట్ల పీఎస్ పరిధిలో ఘటన
ఇబ్రహీంపట్నం, వెలుగు: ఆదిబట్లలో మూడు నెలల క్రితం మిస్సింగ్అయిన వృద్ధుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బొంగళూరు సమీపంలో అతడి అస్థిపంజరాన్ని గుర్తించారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్లలోని ఎంపీ పటేల్ గూడకు చెందిన యంజాల లక్ష్మయ్య (70) సెప్టెంబర్ 22న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు.
మతిస్థిమితం సరిగ్గా లేని అతడి కోసం కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆదిబట్ల పీఎస్ లో ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం బొంగ్లూర్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో ఓ పశువుల కాపరికి వ్యక్తి అస్థిపంజరం కన్పించడంతో పోలీసులకు తెలిపాడు.
దీంతో పోలీసులు అక్కడ వెళ్లి లక్ష్మయ్య కుటుంబసభ్యులకు సమాచారమివ్వగా, ఒంటిపై ఉన్న దుస్తులు, ఇతర ఆనవాళ్లను గమనించి లక్ష్మయ్యగా నిర్ధారించారు. క్లూస్ టీంతో ఆధారాలను సేకరించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాఘవేందర్‌రెడ్డి తెలిపారు.