నార్సింగి దారి దోపిడీ కేసులో సంచలన వాస్తవాలు

నార్సింగి దారి దోపిడీ కేసులో సంచలన వాస్తవాలు

నార్సింగి దారి దోపిడీ కేసులో పోలీసులే విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.కానిస్టేబుల్ రాజుపై దాడికి పాల్పడ్డ కరణ్ సింగ్‌ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడిపై గతంలో పలు కేసులు నమోదయ్యాయి. వైట్నర్ తదితర మత్తుపదార్థాలు తీసుకోవడం, అమ్మాయిలను వేధించడం, దాడి చేసి డబ్బులు, నగలు దోచుకోవడం  కరణ్ సింగ్ అలవాటుగా మార్చుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది. చిన్న వయసు నుంచే దూకుడుగా ఉండే కరణ్ సింగ్.. కత్తితో దాడి చేయడంతో పాటు చంపేందుకు కూడా వెనుకాడేవాడు కాదని తెలిసింది. 10 మందితో ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని దారి దోపిడీలు, చోరీలకు పాల్పడినట్టు చెబుతున్నారు. చోరీ చేసిన బైకులపై అత్తాపూర్, రాజేంద్రనగర్, చంద్రాయణగుట్ట, పహాడిషరీఫ్ ప్రాంతాల్లో హల్ చల్ చేసేవాడని తెలుస్తోంది. 

నిందితుడు కరణ్ సింగ్ తల్వార్ తో అమాయకులపై దాడి చేసి దారి దోపిడీకి పాల్పడేవాడని పోలీసులు చెబుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డులో రాత్రివేళల్లో సెక్స్ వర్కర్స్ కోసం కరణ్ సింగ్ బైక్ పై చక్కర్లు కొట్టేవాడని తెలిపారు. వారి వద్దకు వచ్చే విటులను టార్గెట్ గా చేసుకుని దాడి చేసి దోపిడీకి పాల్పడేవాడని అన్నారు. రాజేంద్రనగర్ పరిధిలో కరణ్ సింగ్ పై 5 కేసులు ఉండగా... ఇందులో 3 కేసులు మైనర్ గా ఉన్నప్పుడే నమోదయ్యాయి. కరీంనగర్ లో ఖరీదైన కారు చోరీ కేసులోనూ కరణ్ నిందితుడిగా ఉన్నాడు. జగద్గిరిగుట్ట లో ప్రేమ పేరుతో మైనర్ పై వేధించిన అతనిపై రాజేంద్రనగర్ పీఎస్ లో రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు. 

గురువారం ఔటర్ సర్వీస్ రోడ్‌ మైసమ్మ దేవాలయం సమీపంలో బైకుపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను నిందితులు అడ్డగించారు. వారిని డబ్బులు డిమాండ్ చేశారు. వారు నిరాకరించడంతో కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో గంధంగూడకు చెందిన కిషోర్ మృతి చెందగా, తులసి అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం వారి నుంచి రూ.15 వేలు నగదు తీసుకొని నిందితులు పరారయ్యారు. గాయపడిన తులసి పోలీస్ స్టేషన్‎కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలో దిగారు. విచారణలో భాగంగా కూకట్ పల్లికి చెందిన ఇద్దరు కానిస్టేబుల్స్ రాజు, విజయ్ జగద్గిరిగుట్ట సిక్కుల బస్తీకి వెళ్లారు. ఈ క్రమంలో సర్దార్ కరణ్ సింగ్ వారిపై తల్వార్‌తో దాడికి దిగాడు. ఈ ఘటనలో పోలీసులిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో రాజు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.