కామారెడ్డిలో అర్ధరాత్రి హైడ్రామా .. మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్‌ ఇంట్లో సోదాలు

తెలంగాణలో ఎన్నికల వేళ వరుస ఐటీ, పోలీసులు దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా నవంబర్  27 వ తేదీన  కామారెడ్డిలో అర్ధరాత్రి హైడ్రామా నడించింది.  కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్‌, కాంగ్రెస్ నేత గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది.  ఆమె ఇంట్లో భారీగా నగదు ఉందనే ఫిర్యాదుతో అర్థరాత్రి దాటాక పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసుల సోదాలు నిర్వహించారు.  విషయం తెలుసుకున్న  స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు  ఆమె ఇంటికి భారీ సంఖ్యలో  చేరుకున్నారు. 

 ఏ ఫిర్యాదుతో ఇంట్లోకి వస్తున్నారని పోలీసులను కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నించారు.  మహిళా కానిస్టేబుల్స్ ఎక్కడా అని ఇందు ప్రియ పోలీసులు ప్రశ్నించారు. ఇంట్లో ఏమీ దొరక్కపోవడంతో పోలీసులు వెనుదిరిగారు.  కాంగ్రెస్ నేతల‌ ఇళ్లపై కావాలనే దాడులు చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్ రావ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఫిర్యాదు చెస్తే పోలిసులు వచ్చారా? లేక బీఆర్ఎస్ నేతలు చెప్తే వచ్చారా అని మండిపడ్డారు.   

కామారెడ్డిలో రేవంత్ రెడ్డికి వస్తున్న మద్దతు చూసి  తట్టుకోలేక బీఆర్ఎస్ నాయకులు ఇలాంటి దాడులకు పాల్పపడుతున్నారని శ్రీనివాస్ రావ్ ఆరోపించారు.  ఇవాళ కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పర్యటన ఉన్న  నేపథ్యంలో పోలిసుల తీరుపై కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.