వనమా రాఘవ పరారీ.. గాలిస్తున్న పోలీసులు

  • వెతుకుతున్న పోలీసులు
  • ఏ క్షణంలోనైనా కస్టడీలోకి.. ముందస్తు బెయిల్​కు ప్రయత్నాలు


భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం జిల్లాలో రామకృష్ణ, అతడి కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడైన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు, టీఆర్ఎస్​ లీడర్​ వనమా రాఘవ పాల్వంచలోని తన ఇంటి నుంచి పరారైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే రామకృష్ణ సూసైడ్​ నోట్​, సెల్​ఫోన్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎవిడెన్స్​ను పరిశీలిస్తున్నామని,  రాఘవ కోసం గాలిస్తున్నట్టు  ఏఎస్పీ రోహిత్​ రాజు తెలిపారు. తన కోసం వెతుకుతున్నారని తెలుసుకున్న రాఘవ అజ్ఞాతంలోకి వెళ్లి ముందస్తు బెయిల్​ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడనే ప్రచారం సాగుతోంది. రాఘవ తండ్రి, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు కూడా కొడుకు అరెస్టు కాకుండా పై స్థాయిలో పైరవీ చేస్తున్నారని సమాచారం. 

హైకమాండ్​ ఆరా.. 
రాఘవ కేసు విషయమై టీఆర్ఎస్​  హైకమాండ్​ ఆరా తీస్తున్నట్టు తెలిసింది. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యలో రాఘవ ప్రమేయంపై సమాచారం సేకరిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు ఇంటెలిజెన్స్​  వర్గాలు కూడా గతంలో వనమా రాఘవపై ఉన్న కేసులు, సెటిల్​మెంట్స్, దందాల ​గురించి తెలుసుకుంటున్నారని టాక్​ వినిపిస్తోంది.  

ట్రీట్​మెంట్​తీసుకుంటూ సాహితి మృతి
దవాఖానాలో ట్రీట్​మెంట్​ తీసుకుంటున్న రామకృష్ణ బిడ్డ సాహితి మంగళవారం చనిపోయింది. సోమవారం కొన ఊపిరితో ఉన్న సాహితిని  కొత్తగూడెం జిల్లా గవర్నమెంట్​హాస్పిటల్​కు తరలించారు. చిన్నారి ప్రాణాన్ని కాపాడేందుకు డాక్టర్లు చివరి వరకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.