- జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసులో పాజిటివ్
- వేరే వాళ్ల ఫోన్ పోలీసులకు ఇచ్చి పరార్
- ఫోన్ కోసమే ఇంట్లో మూడు గంటల పాటు సెర్చ్
చేవెళ్ల, వెలుగు: జన్వాడ ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయిన విజయ్ మద్దూరి ఇంట్లో మోకిల పోలీసులు మంగళవారం సోదాలు చేపట్టారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంట్లో.. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ రమణ గౌడ్, మోకిల సీఐ వీరబాబు ఆధ్వర్యంలో మూడు గంటల పాటు సోదాలు జరిగాయి. డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చిన విజయ్.. పోలీసుల కండ్లుగప్పి పరార్ అయ్యాడు. దీంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. డ్రగ్స్ లింకులు బయటపడ్తాయని ఆలోచించి.. విజయ్ తన ఫోన్ కాకుండా వేరేవాళ్ల ఫోన్ పోలీసులకు అప్పగించాడు. అయితే.. అతని ఫోన్ దొరికితేనే చాటింగ్, ఫోన్‌కాల్స్‌తో వివరాలన్నీ బయటపడ్తాయని పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగానే జూబ్లీహిల్స్‌లోని అతని ఇంట్లో ఫోన్ కోసం వెతికినట్లు సమాచారం. విజయ్ ఇచ్చిన ఫోన్ ఓ మహిళకు సంబంధించినది కావడంతో.. ఆమెను ఆదివారమే విచారించి స్టేట్మెంట్ రికార్డు చేసినట్లు తెలుస్తున్నది. విజయ్ మద్దూరికి హైకోర్టు రెండు రోజుల గడువు మాత్రమే ఇచ్చిందని, ఆయన తప్పనిసరిగా విచారణకు హాజరుకావాల్సిందే అని పోలీసులు తెలిపారు.
చేవెళ్లలో కార్తీక్‌ను విచారించిన ఎన్ఫోర్స్మెంట్
పోలీసుల అనుమతి లేకుండా ఫామ్‌హౌస్‌లో మందు పార్టీ చేసుకున్న ఘటనపై చేవెళ్ల ఎక్సైజ్ పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్ మెంట్ ఏఈఎస్ జీవన్ కుమార్.. చేవెళ్లకు వెళ్లి ఎంక్వైరీ చేశారు. ఏ 1గా ఉన్న సూపర్వైజర్ కార్తీక్‌ను చేవెళ్ల ఎక్సైజ్ సీఐ శ్రీలతతో కలిసి విచారించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఎంక్వైరీ చేసినట్లు తెలుస్తున్నది. ‘‘శనివారం రాత్రి జన్వాడ ఫామ్ హౌస్‌లో ఏం జరిగింది? డ్రగ్స్ ఎక్కడి నుంచి తెచ్చారు? ఎవరెవరు తీసుకున్నారు? ఎవరు సప్లయ్ చేశారు? విదేశీ మద్యం (డ్యూటీ ఫ్రీ లిక్కర్) ఎక్కడిది? రాయదుర్గంలోని రాజ్‌పాకాల ఇంటి సమీపంలో ఉన్న నాగేశ్వర్ రెడ్డి విల్లాలో దొరికిన 57 బాటిల్స్ ఎక్కడి నుంచి తెచ్చారు?’’అనే విషయాలు అడిగినట్లు తెలిసింది. ఇదే కేసులో ఏ 2గా ఉన్న రాజ్‌పాకాల మాత్రం చేవెళ్ల ఎక్సైజ్ పోలీసుల ఎదుట హాజరుకాలేదు.