
- పలువురు రేషన్ డీలర్ల అరెస్ట్
హాలియా, వెలుగు : నాగార్జునసాగర్ నుంచి ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్న 39.50 క్వింటాళ్ల రేషన్‌బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం నాగార్జునసాగర్ విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు వివరాలు వెల్లడించారు. పల్నాడు జిల్లాకు చెందిన తిరువాయిపాటి వెంకటేశ్వర్లు, శెట్టిపల్లి వెంకటేశ్వర్లు అనే బియ్యం వ్యాపారులతో తిరుమలగిరిసాగర్ మండలం నాయకుని తండాకు చెందిన దేవుజానాయక్, చింతపాలెం గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తులు రేషన్ బియ్యం అమ్మేలా ఒప్పందం చేసుకున్నారు.
ఇందులో భాగంగా తిరుమలగిరి (సాగర్) మండలం చిలకాపురం గ్రామ రేషన్ డీలర్ వనమాల నరసింహ వద్ద 50 బస్తాల పీడీఎఫ్ బియ్యం, గరికినట్ తండా రేషన్ డీలర్ విజయ్ వద్ద 30 బస్తాల రేషన్ బియ్యాన్ని తీసుకొని ఐషర్ వాహనంలో సోమవారం ఏపీలోని మాచర్ల వైపు బయల్దేరారు. నాగార్జునసాగర్ చెక్‌పోస్టు వద్ద విజయపురి టౌన్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఐషర్ వాహనంలో నుంచి ఒక వ్యక్తి దూకి పారిపోతుండగా అనుమానం వచ్చిన పోలీసులు ఆ వాహనాన్ని తనిఖీ చేశారు.
అందులో 39.50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బియ్యం వ్యాపారులు తిరుమలపాటి వెంకటేశ్వర్లు, శెట్టిపల్లి వెంకటేశ్వర్లుతోపాటు రేషన్ డీలర్లు వనమాల నరసింహ, విజయ్, నాయకుని తండా చెందిన దేవుజా, చింతలపాలెంకు చెందిన చింతల నాగరాజు, వాహనం డ్రైవర్ దాట్ల బ్రహ్మరాజును అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.