పైసల ముచ్చట ఎట్ల లీకాయే.. ఎన్నికల వేళ బీఆర్ఎస్‌‌‌‌లో అలజడి 

  • ప్రతిమ మల్టీపెక్స్‌‌‌‌లో నగదు పట్టివేతపై బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్​
  • రూ.6.67 కోట్లను హైదరాబాద్ తరలించిన అధికారులు
  • ఐటీ ఆఫీసర్ల అదుపులో ప్రతిమ’ మేనేజర్

కరీంనగర్, వెలుగు: ఎన్నికల ఖర్చుల కోసం అత్యంత పకడ్బందీగా, రహస్యంగా తరలించిన డబ్బు విషయం ఎలా లీకైందనే విషయం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. శనివారం తెల్లవారుజామున రూ.6.67 కోట్ల పట్టివేతపై ఆ పార్టీ లీడర్లు తలపట్టుకుంటున్నారు. ఈ నగదుపై ప్రతిమ మల్టీప్లెక్స్ జనరల్ మేనేజర్, సిబ్బంది ఇన్‌‌‌‌కం ట్యాక్స్ ఆఫీసర్లకు సరైన సమాధానం చెప్పకపోవడం, బీఆర్ఎస్ లీడర్లు ఎవరూ స్పందించకపోవడంతో డబ్బు వ్యవహారంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టుబడిన నగదుపై విచారణ ప్రారంభించిన అధికారులు ఆదివారం తెల్లవారుజాము వరకు కొనసాగించారు. పట్టుబడిన నగదును హైదరాబాద్ కు తరలించారు. అలాగే ప్రతిమ మల్టీపెక్స్ మేనేజర్ రాఘవేంద్రబాబును కూడా అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌‌‌‌ తీసుకెళ్లినట్లు తెలిసింది. 

కట్టలపై సీల్ ఆధారంగా ఎంక్వైరీ

ప్రతిమ మల్టీప్లెక్స్‌‌‌‌లో లభ్యమైన డబ్బుల కట్టలపై వేసిన సీల్ ఆధారంగా అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ నగదు ఏయే బ్యాంకుల్లో డ్రా చేశారని ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఇందులో కొన్ని కరెన్సీ కట్టల త్రెడ్ పై కరీంనగర్ కరెంట్ చెస్ట్ అని లేబుల్ ఉన్నట్లు తెలిసింది. అలాగే మరికొన్ని నగదు కట్టలను యూనియన్ బ్యాంక్ నుంచి డ్రా చేసినట్లుగా ఐటీ ఆఫీసర్లు గుర్తించినట్లు సమాచారం.

 మరోవైపు ప్రతిమ మల్టీప్లెక్స్‌‌‌‌ సెల్లార్‌‌‌‌‌‌‌‌లో ఒకే సీసీ కెమెరా ఉండడం అనుమానాలకు తావిస్తోంది. డబ్బు మార్పిడి జరిగిన ఏరియా సీసీ కెమెరాలో కవర్​కాకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటలవరకు సెల్లార్‌‌‌‌‌‌‌‌లోకి ఎన్ని వాహనాలు వచ్చాయి.. ? వాటిల్లో ఎవరొచ్చారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే వదిలేసిన ఖాళీ అట్ట పెట్టెల్లోని నగదు ఏమైందనే విషయంపై లోతుగా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

పార్టీ నేతలే లీక్‌‌‌‌ చేశారా..? 

కరీంనగర్ జిల్లా చరిత్రలో తొలిసారిగా ఎన్నికల సమయంలో భారీగా నగదు పట్టుబడడం.. అది కూడా బీఆర్ఎస్ అధికార కార్యక్రమాలకు, ఆ పార్టీ నేతల విడిదికి నెలవుగా ఉండే ప్రతిమ మల్టీపెక్స్ లో దొరకడం చర్చనీయాంశంగా మారింది. ఆదివారం రాత్రి వరకు ఈ డబ్బుకు సంబంధించిన వివరాలేవి సదరు ప్రతిమ యాజమాన్యం వెల్లడించలేదు. ఇటు పోలీసులు, అటు ఐటీ ఆఫీసర్లు కూడా పట్టుబడిన డబ్బుకు లెక్కల్లేవని, అకౌంటబులిటీ లేని అమౌంట్ అని  వెల్లడించారు. మరోవైపు గుట్టుగా సాగిన ఈ వ్యవహారాన్ని లీక్ చేసిందెవరనే విషయం బీఆర్ఎస్‌‌‌‌లో హాట్ టాపిక్ గా మారింది.

డబ్బు తరలింపు వ్యవహారం ఎవరెవరికి తెలుసు?  ఎవరు లీక్ చేసి ఉంటారనే విషయంపై పార్టీ నేతలు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. వినోద్ కుమార్ వెంట ఉంటూనే ఆయన గెలవడం ఇష్టం లేని లీడర్లే లీక్ చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పార్టీలో ఎవరిని నమ్మాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఒకరు 
వెల్లడించారు. కోవర్టు ఆపరేషన్లతో ఆ పార్టీ నేతలు వణికిపోతున్నారు. 

‘ప్రతిమ’ కార్యకలాపాలపై అనుమానాలు 

కరీంనగర్ లోని ఆర్టీసీ స్థలంలో నిర్మించిన ప్రతిమ మల్టీప్లెక్స్ లో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ కార్యకలాపాలపై కాంగ్రెస్ పార్టీ, ఏఐవైఎఫ్​ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీకి చెందిన స్థలాన్ని లీజుకు తీసుకుని నిర్మించిన కాంప్లెక్స్ లో ఇలా లెక్కకు రాని నగదును భారీగా నిల్వ చేయడంపై మండిపడుతున్నారు. అవినీతికి సొమ్ముకు నిలయంగా మారిన మల్టీపెక్స్ అనుమతులు రద్దు చేయాలని, ఆ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.  

బీఆర్ఎస్ లీడర్ల మౌనం 

ప్రతిమ మల్టీప్లెక్స్ లో దొరికిన రూ.6.67 కోట్ల నగదు బీఆర్ఎస్ పార్టీకి చెందినదిగా ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ఇప్పటివరకు ఆ పార్టీ నుంచిగానీ, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ నుంచి గానీ ఎలాంటి స్పందన లేదు. పార్టీతోపాటు వినోద్ కుమార్ మౌనంపై అనుమానాలు వ్యక్తమవుతన్నాయి. అలాగే ఇప్పటివరకు ప్రతిమ మల్టీప్లెక్స్ యాజమాన్యం కూడా లెక్కలు చెప్పడం లేదు.