- వివరాలు వెల్లడించిన ఎస్పీ రూపేశ్
సంగారెడ్డి టౌన్, వెలుగు: అక్రమంగా తరలిస్తున్న 110 కిలోల ఎండు గంజాయిని శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. జహీరాబాద్ పాత ఆర్డీవో చెక్ పోస్ట్ సమీపంలో 65వ నేషనల్ హైవే బైపాస్ లో మెగా వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా హైదరాబాద్ నుంచి ముంబై వైపు వెళ్తున్న మారుతి షిఫ్ట్ కారులో ఎండు గంజాయి లభ్యమైంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎస్పీ రూపేశ్ వెల్లడించారు. చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీ చేస్తుండగా మారుతి షిఫ్ట్ కారును పోలీసులు ఆపితే ఆపకుండా తప్పించుకుపోయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆ కారును పోలీసులు ఛేజింగ్ చేయగా కొద్ది దూరం వెళ్లాక రోడ్డుపై కారును వదిలేసి పారిపోయే ప్రయత్నం చేశారు.
ఇద్దరిని పోలీసులు పట్టుకోగా మరో ముగ్గురు పారిపోయారు. కారులో రూ.30 లక్షల విలువ చేసే 110 కిలోల ఎండు గంజాయి లభించింది. గంజాయి తరలించే క్రమంలో ఇన్నోవా కారులో నవాజ్, షబ్బీర్ సిగ్నల్స్ ఇస్తూ ముందుకు వెళ్తుండగా, వెనకాల కారులో ఉన్న మహమ్మద్ అక్బర్, మహమ్మద్ సల్మాన్ గంజాయిని తరలించే ప్రయత్నం చేసినట్టు ఎస్పీ తెలిపారు. జహీరాబాద్ శాంతి నగర్ కు చెందిన మహమ్మద్ అక్బర్, మహమ్మద్ సల్మాన్ ను అరెస్టు చేయగా, వీరి అన్న ఇస్మాయిల్ అతడి అనుచరులు మహబూబ్, రజాక్ లు పరారీలో ఉన్నారని వెల్లడించారు. సీజ్ చేసిన గంజాయి 27-ప్యాకెట్లు ఒక్కొక్క ప్యాకెట్ సుమారు 4-కిలోలు ఉంటుందన్నారు.
అరెస్టు చేసిన ఇద్దరు వ్యక్తుల నుంచి రెండు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని జహీరాబాద్ పీఎస్లో కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు తరలించినట్టు ఎస్పీ తెలిపారు. మీడియా సమావేశంలో అడిషనల్ఎస్పీ సంజీవ రావు, డీఎస్పీ రామ్ మోహన్ రెడ్డి, టీ న్యాబ్- డీఎస్పీ పుష్పన్ కుమార్, జహీరాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్శివలింగం, ఎస్ఐ కాశీనాథ్, ప్రసాద్ రావు ఉన్నారు.