కాగజ్ నగర్‌‌లో 208 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

కాగజ్ నగర్‌‌లో 208 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

కాగజ్ నగర్, వెలుగు: మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 208 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. సిర్పూర్ టీ పోలీస్ స్టేషన్​లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్​లో కౌటాల్ సీఐ ముత్యం రమేశ్, ఎస్ఐ కమలాకర్​తో కలిసి ఎస్పీ డీవీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. బియ్యం అక్రమ రవాణాపై పక్కా సమాచారంతో మంగళవారం ఉదయం చెక్​పోస్ట్ ​వద్ద తనిఖీలు చేపట్టి మూడు వాహనాల్లో తరలిస్తున్న 208 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని పట్టుకున్నారు. 

డ్రైవర్లు కాగజ్ నగర్​కు చెందిన ఇషాక్ అహ్మద్, మహ్మద్ కలీంను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ బియ్యం మహ్మద్ రజిక్ రహెమాన్, సయ్యద్ ఆరిఫ్​విగా గుర్తించారు. భీమిని మండలం జనకాపూర్ గ్రామానికి చెందిన రాకేశ్, అశోక్ వద్ద కొనుగోలు చేసి.. మహారాష్ట్రలోని వీరూర్​కి చెందిన ఉప్పరె సంతోష్​కు అమ్మేందుకు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. పట్టుబడ్డ బియ్యం విలువ రూ.7.48 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. కొన్ని బియ్యం బస్తాలు డైరెక్ట్​గా  రేషన్ డీలర్ షాపులో నుంచి వచ్చినట్టుగా తేలిందని.. దీనిపై రెవెన్యూ అధికారులతో దర్యాఫ్తు చేస్తున్నామని చెప్పారు. బియ్యాన్ని తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నామని, మిగతా వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.