- 8 మందిని అరెస్ట్ చేసిన పోలిసులు
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 319, మహబూబాబాద్ జిల్లాలో 187 కిలోల చొప్పున స్వాధీనం
భద్రాచలం, వెలుగు: ఐదు వేర్వేరు కేసుల్లో 319 కిలోల గంజాయిని భద్రాచలంలో ఆబ్కారీ సీఐ రహీమున్నీషా ఆధ్వర్యంలో పట్టుకున్నారు. ఐదుగురిని అరెస్ట్ చేసి రెండు కార్లు, స్కూటీ, బైక్,సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.79.75లక్షలు ఉంటుంది. ఖమ్మం డీసీ జనార్దన్ రెడ్డి, భద్రాద్రి జిల్లా ఏసీ గణేశ్, ఎక్సైజ్సూపరింటెండెంట్జానయ్య మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కొత్తపల్లికి చెందిన నేరెళ్ల అపర్ణ, ఆమె కొడుకు అఖిల్100 కిలోల గంజాయిని కారులో నిజామాబాద్ కు చెందిన మునావర్అలీకి అందించేందుకు తీసుకెళ్తూ దొరికారు.
అపర్ణ భర్త కూడా గంజాయి స్మగ్లర్. స్కూటీపై14 కేజీల గంజాయి తరలిస్తూ హైదరాబాద్ బాలానగర్ కు చెందిన శక్తి రాహుల్, గోపిశెట్టి అక్షిత పట్టుబడ్డారు. మోతుగూడెం నుంచి హైదరాబాద్ కు 180 కిలోల గంజాయిని తీసుకెళ్తుండగా బేగంబజార్ కు చెందిన దత్తు పంచల్ పట్టుబడ్డాడు. మరో రెండు కేసుల్లో 25 కిలోల గంజాయిని భద్రాచలం చెక్ పోస్టు వద్ద పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేయగా మరో ఐదుగురు పరారీలో ఉన్నారు.
ఒడిశా టు హైదరాబాద్ తరలిస్తూ..
గూడూరు : గంజాయిని తరలిస్తున్న ముగ్గురు పట్టుకుని, 187 కిలోల గంజాయి, రెండు కార్లు, మూడు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. 46.76 లక్షలు ఉంటుంది. మంగళవారం గూడూరు పోలీస్ స్టేషన్ లో మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఒడిశాలోని మల్కనగిరి జిల్లాకు చెందిన బాపన్ అనే వ్యక్తి హైదరాబాద్ కు గంజాయి తరలించేందుకు ముగ్గురు వ్యక్తులను కాంట్రాక్టుగా మాట్లాడుకున్నాడు.
రెండు కార్లలో ముగ్గురు వ్యక్తులు 187 కిలోల గంజాయితో ఒంగోలు నుంచి మహబూబాబాద్ మీదుగా హైదరాబాద్ కు వెళ్తుండగా.. గూడూరు మండలం మచ్చర్ల వద్ద పోలీసులు వాహనాల తనిఖీల్లో భాగంగా రెండు కార్లను ఆపి చెక్ చేయగా గంజాయి దొరికింది. ఒడిశాకు చెందిన మండల నరేశ్, చత్తీస్ గడ్ కు చెందిన రాహుల్ మజుందార్, హరీశ్యాదవ్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు బాపన్ పరారీలో ఉండగా గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. గూడూరు పోలీసులను డీఎస్పీ అభినందించారు.