- పైన పనసకాయలు కింద గాంజా
- మరోచోట ప్లైవుడ్ షీట్స్కప్పి తరలింపు
- ఇంకో చోట ప్రైవేట్‌బస్సు లగేజీ క్యాబిన్ కట్‌చేసి ట్రాన్స్‌పోర్టేషన్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు పోలీస్స్టేషన్ల పరిధిలో ఆదివారం ఒకే రోజు సుమారు 1,035 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ. 2,58,48,500 ఉంటుంది. ఆ వివరాలను ఎస్పీ బి. రోహిత్‌రాజు తెలియజేశారు. భద్రాచలం పోలీస్‌స్టేషన్ పరిధిలోని కూనవరం రోడ్డులో ఉన్న ఆర్టీఏ ఆఫీస్ఎదురుగా భద్రాచలం ఎస్సై విజయలక్ష్మి వెహికిల్స్ తనిఖీ చేస్తుండగా రెండు వాహనాల్లో 427కిలోల గంజాయి దొరికింది.
ఆంధ్రప్రదేశ్‌లోని మోతుగూడెం, సుకుమామిడి నుంచి ఏడుగురు వ్యక్తులు రెండు వాహనాల్లో ప్లైవుడ్షీట్స్పైన ఉంచి కింద గంజాయి పెట్టి హైదరాబాద్ తరలిస్తున్నట్టు గుర్తించారు. అశ్వారావుపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని జంగారెడ్డిగూడెం రోడ్డులోని సాయిబాబా టెంపుల్వద్ద ఎస్సై శ్రీనివాస్ వెహికిల్స్ చెక్ చేస్తుండగా ఓ ఫోర్వీలర్లో 359 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పనసకాయల లోడ్ అని అందరూ అనుకునే విధంగా వాహనం వెనక గంజాయి పెట్టి పైన పనసకాయలను ఉంచారు.
వీరు గంజాయిని ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా దారకొండ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. అశ్వాపురం పోలీస్‌స్టేషన్‌పరిధిలో ఎస్సై తిరుపతి వాహనాలు చెక్ చేస్తుండగా ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌బస్సు లగేజీ క్యాబిన్ లోపలి భాగంలో, వెనుక సీట్ల కింద భాగాన్ని కట్‌చేసి అందులో గంజాయి తరలిస్తున్నట్టు కనిపెట్టారు. ఇక్కడ 249 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోతో కో ఆర్డినేషన్ చేసుకుంటూ గంజాయి రవాణాను అడ్డుకుంటున్నామని తెలిపారు. గంజాయి పట్టుకున్న పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించారు.