బ్రాండెడ్‍ కంపెనీల స్టిక్కర్లు వేసి కల్తీ నూనె అమ్మకం…

వంట నూనెలు కల్తీ చేస్తున్న ఏజెన్సీపై దాడి చేసిన ఆఫీసర్లు నాలుగు వేల లీటర్లు నూనె స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్​ జిల్లా కేంద్రం రాణీసతీజీ కాలనీలోని శ్రీనివాస ఏజెన్సీలో ఆదివారం జిల్లా గజిటెడ్‍ ఫుడ్‍ ఇన్స్ పెక్టర్‍ రాజేంద్రనాథ్‍ పట్టణ టాస్క్​ఫోర్సు పోలీసులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కల్తీ జరుగుతున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. వంటనూనె, కాలం చెల్లిన వందలాది నూనె ప్యాకెట్లు నాలుగు వేల లీటర్ల వరకు స్వాధీనం చేసుకున్నారు.  నూనెలను ఏ విధంగా కల్తీ చేస్తున్నారో ప్రత్యక్షంగా పరిశీలించారు. పామాయిల్‍తోపాటు కాలం చెల్లిన నూనెలను కలిపి డబ్బాల్లో నింపుతున్నారు.

బ్రాండెడ్‍ కంపెనీలైన ప్రియాగోల్డ్, ఫ్రీడం, గోల్డ్ విన్నర్ వంటి కంపెనీల స్టిక్కర్లను ఆ డబ్బాలపై అతికించి జిల్లా కేంద్రంలోని హోటళ్లు, క్యాటరింగ్‍ నిర్వాహకులకు విక్రయిస్తున్నారు. దీనిపై ఏజెన్సీ యజమానిని ప్రశ్నించగా నూనెలు కారిపోతుండడంతో డబ్బాల్లో నింపుతున్నామని సమాధానమిచ్చారు. నూనెల్లో కల్తీ ఎంత జరిగిందనే విషయాన్ని తెలుసుకునేందుకు ఆఫీసర్లు ప్రత్యేక సీసాల్లో శాంపిల్స్ సేకరించి హైదరాబాద్‍లోని నాచారం ఫుడ్‍ లాబొరేటరీకి పంపించారు. ఏజెన్సీపై సెక్షన్ 51, 52, ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు. లాబొరేటరీ రిపోర్ట్​14 రోజుల్లో వస్తుందని, నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఫుడ్​ఇన్స్​పెక్టర్​తెలిపారు.