![రెండోసారి పట్టుబడితే జైలే .. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులు సీరియస్](https://static.v6velugu.com/uploads/2025/02/police-serious-about-drunk-driving-in-nizamabad_HgKPAOWE3d.jpg)
- ప్రమాదాల్లో సగం మద్యం మత్తులో జరిగినవే
- గతేడాది 7,698 కేసులు, రూ.89 లక్షల ఫైన్
నిజామాబాద్, వెలుగు: మద్యం తాగి వాహనాలు నడిపే వారి పట్ల జిల్లా పోలీసులు సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకసారి జరిమానా కట్టిన వారు తీరు మార్చుకోకుండా మరోసారి మద్యం తాగి బండి నడుపుతూ పట్టుబడితే జైలుకు పంపుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ప్రమాదాలు జరగకుండా నియంత్రించడానికి ప్రతి రోజు జిల్లాలో సుమారు 300 పోలీసులు బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లు చేస్తున్నారు. వీకెండ్లలో, పండుగ రోజుల్లో విరివిగా తనిఖీలు చేపడుతున్నారు.
831 యాక్సిడెంట్లు
జిల్లాలో గతేడాది మొత్తం 831 రోడ్ యాక్సిడెంట్లు జరగగా 335 మంది మరణించారు. 758 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇంకా చాలా మంది బాధితులు పూర్తిగా కోలుకోలేదు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 39 రోడ్డు ప్రమాదాలు జరిగి 18 మంది చనిపోగా 54 మంది గాయాలతో హాస్పిటల్స్ చేరారు. వీటిలో సగం వరకు ప్రమాదాలు లిక్కర్ మత్తులో వాహనాలు నడపడంవల్ల జరిగినవే. దీంతో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పై ఫోకస్ పెట్టారు.
పట్టణాలతో పాటు మేజర్ గ్రామాల్లో కూడా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల వద్ద బ్రీత్ అనలైజర్లతో టెస్ట్ చేస్తున్నారు. ఈ టెస్ట్‌ల్లో గత ఏడాది జిల్లాలో 7,698 మందిని పట్టుకొని రూ.88.90 లక్షల జరిమానా విధించారు. పట్టుబడినవారిలో 165 మందికి జైలు శిక్షపడింది. జనవరి నుంచి ఇప్పటిదాకా దాదాపు వెయ్యి మందిని పట్టుకోగా రూ.7 లక్షల జరిమానా వసూలు చేశారు. 37 మందిని జైలుకు పంపారు.
బీఏసీ కౌంట్ 35 దాటితే కేసు
మార్కెట్లో దొరికే లిక్కర్ లో సాధారణంగా 43 శాతం ఆల్కహాల్ ఉంటుంది. రెండు పెగ్గులు తాగితే బాడీలో బీఏసీ (బ్లడ్ఆల్కహాల్ కంటెంట్) 65 పాయింట్లు దాటుతుంది. ఒక బీర్తాగితే 30 బీఏసీ నమోదవుతుంది. 35 కన్నా ఎక్కువ బీఏసీ పాయింట్లు ఉంటే కేసులు, జరిమానాలు తప్పవు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో పట్టుబడిన చాలా మందిలో 200 నుంచి 300 బీఏసీ పాయింట్లు నమోదవుతున్నాయి. వారు పూర్తిగా మద్యం మత్తులో బండ్లు నడుపుతూ యాక్సిడెంట్లకు కారణమవుతున్నారు. మొదటిసారి పట్టుబడినవారికి ఫైన్ వేసి వదిలేసినా రెండోసారి పట్టుబడితే మాత్రం కఠినం వ్యవహరిస్తున్నారు. వారిని కోర్టులో హాజరు పరిస్తే జరిమానాతో పాటు నెల రోజులవరకు జైలు శిక్ష పడుతుంది.
ప్రమాదాలు జరగకుండా చూడాలనే ...
ఫైన్లు వేయడం, జైలుకు పంపడం కోసం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు చేయడంలేదు. మద్యం మత్తులో జరుగుతున్న రోడ్ యాక్సిడెంట్లను నిలువరించడానికి చేస్తున్నం. జనాల్లో అవేర్నెస్ రావాలి. తాగి బండ్లునడపకుండా ఎవరికివారే నియంత్రించుకోవాలి. డ్రంక్ అండ్ డ్రైవ్తనిఖీల్లో నెలకు 1500 వరకు కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. టి.నారాయణ, ట్రాఫిక్ ఏసీపీ, నిజామాబాద్